
ప్రకృతి ప్రసాదించిన అనేక ఔషధ గుణాలున్న దినుసులలో నల్ల జీలకర్ర. జీలకర్రలో సాధారణంగా మూడు రకాలు ఉంటాయని తెలియజేశారు. మనం తరచుగా తాలింపులలో వాడే సాధారణ జీలకర్ర, బిర్యానీలు వంటి రుచికరమైన వంటకాలలో ఉపయోగించే షాజీరా , ప్రత్యేక ఔషధ విలువలు కలిగిన నల్ల జీలకర్ర. షాజీరా ఘాటైన సువాసన కలిగి ఉండగా, నల్ల జీలకర్ర దాని సువాసన, రుచి కారణంగా డ్రెస్సింగ్గా ఉపయోగించడానికి చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని నాన్, తందూరి రొట్టెలపై చల్లుకోవచ్చు. సలాడ్లు, ఫ్రూట్ సలాడ్లు, పాస్తా, నూడుల్స్, మొలకలు, వెజ్ సలాడ్లు, సాండ్విచ్లపై చల్లి తీసుకోవచ్చు.

జీర్ణక్రియ మెరుగుదల: ఇది జీర్ణవ్యవస్థకు అత్యంత ప్రయోజనకారి. జీర్ణరసాలను, ఎంజైమ్లను సమృద్ధిగా ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని పెంచి, తిన్న ఆహారం శరీరానికి చక్కగా పట్టేలా చేస్తుంది. ఫాస్టింగ్ షుగర్ స్థాయిలు అదుపులోకి రాని వారికి నల్ల జీలకర్ర చాలా ఉపయోగపడుతుంది. సాయంత్రం పూట ఒక అర స్పూన్ లేదా స్పూన్ నల్ల జీలకర్రను తీసుకోవడం వలన ఉదయం రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని అంటున్నారు.

నల్ల జీలకర్రలో ఉండే లినోలిక్ ఆమ్లం తెల్ల జుట్టు రాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. దీనికి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల తలలో దాడి చేసే క్రిముల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇది చుండ్రు, తలలో దురదలు రాకుండా కాపాడుతుంది. జుట్టు కుదుళ్ల భాగంలో రక్త ప్రసరణను పెంచి, జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి దోహదపడుతుంది.

నరాల కణాలు సమర్థవంతంగా పని చేయడానికి, వాటి మరమ్మత్తుకు నల్ల జీలకర్ర చాలా ముఖ్యమైనది. మెదడును చురుకుగా ఉంచడంలో కీలకపాత్ర పోషించే ఫ్లేవనాయిడ్లు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. నల్ల జీలకర్రలో థైమాల్, నెగిలిసిన్, కార్వికాల్ వంటి రసాయన సమ్మేళనాలు ఉంటాయి.

ఇవి చర్మ కణాలను కాలుష్యం, సూర్యరశ్మి వంటి వాతావరణ ప్రభావాల నుండి రక్షించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పొడి చర్మంతో బాధపడేవారికి ఇది ప్రధానంగా చర్మాన్ని హైడ్రేట్ చేసి, డ్రైనెస్ రాకుండా కాపాడుతుంది. కాలేయానికి ఇది చాలా మంచిది. శరీరంలో పేరుకుపోయే హెవీ మెటల్స్, కొన్ని రసాయన సమ్మేళనాలను కాలేయం నుండి తొలగించడానికి నల్ల జీలకర్ర సహాయపడుతుంది. ఇది కాలేయ కణాలు దెబ్బతినకుండా రక్షించి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.