
ప్రస్తుత కాలంలో ఎక్కువసేపు స్క్రీన్లు చూడటం, పెరుగుతున్న కాలుష్యం, మారిన జీవనశైలి కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో కంటి సమస్యలు కూడా ఒకటి. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే మీరు ఖరీదైన మందులు వాడాల్సిన పనిలేదు. మీ ఆహారంలో సరైన పండ్లు, కూరగాయలను చేర్చుకుంటే సరిపోతుంది. వాటిలో ఉండే పోషకాలే మీ కళ్లకు అమృతంగా పనిచేస్తాయి.

న్యూఢిల్లీలోని డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, విట్రోరెటీనా సర్జన్ డాక్టర్ ప్రభజోత్ కౌర్ ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన పండ్లు, కూరగాయలు కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే వాటిలో మన కంటి ఆరోగ్యానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఇందుకోసం మీరు నారింజ, మామిడి, కివీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి.

ఈ పండ్లు మీ కళ్లు ఆరోగ్యంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే వీటిలో విటమిన్ A, C, E, బీటా-కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కంటి కణాలకు కలిగే నష్టాన్ని తగ్గించి, వయసు పెరిగేకొద్దీ వచ్చే సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా విటమిన్ C, E కంటి కణజాలాన్ని మెరుగుపరిచి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి.

పండ్లే కాదు కూరగాయల్లో కూడా మీ కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు క్యారెట్, పాలకూర, చిలగడదుంప, క్యాప్సికం, బ్రోకలీ వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో లుటిన్, జియాక్శాంతిన్ వంటి ముఖ్యమైన పోషకాలు కంటి రెటీనాను రక్షిస్తాయి. అలాగే వీటిలో విటమిన్ A, C, E, బీటా-కెరోటిన్ ఉంటాయి. ఇవి కంటి చూపు మందగించకుండా సహాయపడతాయి.

అయితే కేవలం పండ్లు, కూరగాయలతోనే కంటి సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టలేము. కాబట్టి మీకు మసకగా కనిపిస్తున్నా, కళ్లలో నొప్పి ఉన్నా లేదా చూపు మందగిస్తున్నా వెంటనే నిపుణులను సంప్రదించాలి. సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే పెద్ద సమస్యలను నివారించవచ్చు.