
కావలసిన పదార్థాలు: ఎర్ర బియ్యం 1 కప్పు, తాటి బెల్లం తురుము 3 కప్పులు, ఆవు నెయ్యి 5 టేబుల్ స్పూన్లు, నీళ్లు 3 ముప్పావు కప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నల్ల ఎండు ద్రాక్ష 2 టేబుల్ స్పూన్లు, సొంటి పొడి 1 టీస్పూన్, యాలకుల పొడి 1 టీస్పూన్, పచ్చ కర్పూరం చిటికెడు.

ముందుగా ఒక కప్పు ఎర్ర బియ్యం తీసుకుని, నీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఈ బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె లేదా పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో కడిగిన ఎర్ర బియ్యాన్ని వేసి సన్నని మంటపై కమ్మటి సువాసన వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత బియ్యం కొలిచిన కప్పుతోనే మూడు కప్పుల నీళ్లు పోసి, మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. అన్నం మరీ మెత్తగా కాకుండా, చేత్తో నొక్కితే మెత్తగా నలిగేలా కాస్త పలుకుగా ఉడకాలి.

బియ్యం ఉడికే లోపు మరో గిన్నెలో ముప్పావు కప్పు నీళ్లు పోసి, సన్నగా తురిమిన మూడు కప్పుల తాటి బెల్లం వేయాలి. తాటి బెల్లం వాడటం వల్లే ఈ ప్రసాదానికి అసలైన రంగు, రుచి వస్తాయి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగేవరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఉడికిన ఎర్ర బియ్యంలో కరిగించుకున్న తాటి బెల్లం నీటిని వడకట్టి పోయాలి. ఇప్పుడు మంటను తగ్గించి, అడుగు పట్టకుండా కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం కాస్త దగ్గరపడటం మొదలయ్యాక సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు, నల్ల ఎండు ద్రాక్ష వేయాలి. వీటిని నేతిలో వేయించకుండా నేరుగా వేయడం వల్ల పాకంతో పాటు ఉడికి మంచి రుచిని ఇస్తాయి. మధ్యమధ్యలో కొద్దికొద్దిగా ఆవు నెయ్యి వేస్తూ ఓపికగా ఉడికించాలి.

పాయసం బాగా చిక్కబడిన తర్వాత ఒక టీస్పూన్ సొంటి పొడి, ఒక టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం వేసి బాగా కలపాలి. మిశ్రమం చేతి వేళ్ల మధ్య చిక్కటి తీగపాకం వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత మరింత చిక్కగా మారే ఈ అరవణ పాయసాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆరగిస్తే ఆ ఆనందమే వేరు. ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది.