
కావలసిన పదార్థాలు పావుకిలో లేత గుత్తి వంకాయలు, రెండు చెంచాల పల్లీలు, రెండు చెంచాల నువ్వులు, ఒక చెంచా ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఏడు ఎండుమిర్చి, చిన్న ఎండుకొబ్బరి ముక్క, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు, ఒక ఉల్లిపాయ, పసుపు, ఉప్పు, కారం, నూనె, కరివేపాకు, కొత్తిమీర ముందుగా సిద్ధం చేసుకోవాలి.

మసాలా తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో పల్లీలు వేసి కొద్దిగా వేయించాలి. సగం వేగిన తర్వాత నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండుకొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించాలి. దినుసులు మాడిపోకుండా చిన్న మంట మీద వేయించుకుంటే కమ్మటి సువాసన వస్తుంది. వేయించిన మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో ఈ మిశ్రమం, అల్లం, వెల్లుల్లి, తగినంత ఉప్పు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండు రసం, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

వంకాయలు సిద్ధం చేయడం లేత వంకాయలను తీసుకుని నీటిలో కడగాలి. ప్రతి వంకాయను తొడిమ ఉంచి, అడుగు భాగం నుంచి నాలుగు భాగాలుగా కట్ చేయాలి. పురుగులు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్లలో వేస్తే వంకాయలు చేదు ఎక్కకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ను ప్రతి వంకాయ లోపల బాగా దట్టంగా కూరాలి. మిగిలిన మసాలాను గ్రేవీ కోసం జాగ్రత్తగా పక్కన ఉంచుకోవాలి.

కూర తయారీ అడుగు మందంగా ఉండే కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. అందులో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు బాగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మసాలా కూరిన వంకాయలను నూనెలో నెమ్మదిగా వేయాలి. మంటను పూర్తిగా తగ్గించి, మూత పెట్టి ఐదు నిమిషాలు వంకాయలను మగ్గనివ్వాలి. అప్పుడే ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది.

వంకాయలు సగం ఉడికి, నూనెలో మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్న మిగిలిన మసాలా పేస్ట్, పసుపు, కారం, అవసరమైతే మరికాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టాలి. పదిహేను నిమిషాల పాటు చిన్న మంట మీద కూరను చక్కగా ఉడకనివ్వాలి. వంకాయలు మెత్తగా ఉడికి, నూనె పైకి తేలే వరకు ఉడికిస్తే ఎంతో కమ్మటి వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. కూరలో ఉప్పు కారం సరిచూసుకుని, గ్రేవీ బాగా చిక్కబడి నూనె పైకి తేలిన తర్వాత, సన్నగా తరిగిన తాజా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.వేడి అన్నంలో ఈ అద్భుతమైన గుత్తి వంకాయ కూర కలుపుకుని తింటే ఆ మజాయే వేరు.