
కావలసిన పదార్థాలు: అర కిలో తాజా పచ్చి వంకాయలు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, చింతపండు మునిగేంత వరకు మరిగే వేడి నీళ్లు, 1 కప్పు పల్లీ నూనె లేదా వంట నూనె, అర కప్పు కారం పొడి, 1 పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ రాళ్ల ఉప్పు లేదా సాల్ట్, వేపుడు & మసాలా పొడి కోసం: 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ మెంతులు. తాలింపు కోసం: 1 టీస్పూన్ శనగపప్పు, 1 టీస్పూన్ మినప్పప్పు, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 4 నుండి 5 ఎండు మిరపకాయలు, 2 రెమ్మల తాజా కరివేపాకు

తయారీ విధానం: అర కిలో వంకాయలను నీటిలో కడిగి, పొడి కాటన్ క్లాత్‌తో చుక్క తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండులోని గింజలు, ఈనెలన్నీ తొలగించి.. కొద్దిగా వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. చల్లటి నీళ్లు వాడకూడదు, వేడి నీళ్లే వాడాలి.

స్టవ్‌పై పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ మెంతులు వేయాలి. లో ఫ్లేమ్‌పై దోరగా రంగు మారి సువాసన వచ్చే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. పాన్‌లో 1 కప్పు పల్లీ నూనె పోసి బాగా వేడిచేయాలి. నూనె కాగే లోపు వంకాయల తొడిమెలు కొద్దిగా ఉంచి.. గుత్తి వంకాయలా నాలుగు గాట్లు పెట్టి లోపల పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మీడియం మంటపై వంకాయలను వేసి వేయించాలి. వంకాయలు విడిపోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మెత్తబడగానే జల్లి గరిటెతో ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

పాన్‌లోని వేడి నూనెలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి వేయించాలి. పోపు వేగాక దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వెల్లుల్లి గోల్డెన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండును చేత్తో పిసికి గుజ్జులా చేసి నూనెలో వేసి లో ఫ్లేమ్‌పై కేవలం 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేలా వేయించి స్టవ్ ఆఫ్ చేసి తాలింపును పూర్తిగా చల్లారనివ్వాలి.

మిక్సీ జార్‌లో అర కప్పు కారం పొడి, ఒక పెద్ద వెల్లుల్లి పాయ రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఈ వెల్లుల్లి కారంలో ముందుగా చేసి పెట్టుకున్న ధనియాల మసాలా పొడిని వేసి చేత్తో ఉండలు లేకుండా కలపాలి. చల్లారిన వేయించిన వంకాయల గాట్లలోకి ఈ మసాలా కారాన్ని గుత్తి వంకాయలా విరిగిపోకుండా జాగ్రత్తగా స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసిన వంకాయల పైనుంచి చల్లారిన తాలింపు నూనెను, మిగిలిన మసాలా పొడిని పోసి చేత్తో వంకాయలన్నింటికీ నూనె పట్టేలా సున్నితంగా కలపాలి. దీనిని ఒక గాజు సీసాలో లేదా గిన్నెలో పెట్టి మూతపెట్టి ఒక్క రోజు కదపకుండా ఊరనివ్వాలి.

ఒక్క రోజు తర్వాత మూత తీసి చూస్తే వంకాయ ముక్కలు రసాన్ని పీల్చుకుని ఎర్రటి రంగుతో ఊరి ఉంటాయి. అంతే, నోరూరించే ఆంధ్ర స్టైల్ 'వంకాయ నిల్వ పచ్చడి' సిద్ధం! తడి తగలకుండా గాజు సీసాలో భద్రపరుచుకుంటే రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది; వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ వంకాయ ముక్కను నలుపుకుని తింటుంటే స్వర్గంలా ఉంటుంది!