
కావలసిన పదార్థాలు: అర కప్పు పల్లీలు, 6 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, 8 నుండి 10 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ముక్కలుగా తరిగిన టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజులో సగం చింతపండు, పావు టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అర కప్పు తాజా కొత్తిమీర తరుగు, 2 రెమ్మల కరివేపాకు , రుచికి సరిపడా ఉప్పు 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వంట నూనె, పోపు దినుసులు 1 టీస్పూన్, 2 తుంచిన ఎండు మిరపకాయలు

తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత అర కప్పు పల్లీలను వేసి లో-మీడియం మంటపై దోరగా వేయించాలి. పల్లీలు సగం వేగిన తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసి రెండూ మంచి సువాసన వచ్చే వరకు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

అదే పాన్‌లో మిగిలిన నూనెలో ఘాటు పెట్టిన పచ్చిమిరపకాయలను వేసి మాడిపోకుండా వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోనే అర కప్పు కొత్తిమీర తరుగు వేసి పచ్చివాసన పోయేలా ఒక్క నిమిషం పాటు వేయించి పల్లీలు ఉన్న ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే పాన్‌లో తరిగిన టమాటా ముక్కలు, చింతపండు, పావు టీస్పూన్ పసుపు, టమాటాలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి మీడియం మంటపై మధ్యమధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తగా గుజ్జులా మారే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

మిక్సీ జార్‌లో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. మొదట వీటిని ఒకసారి ఆపుతూ కచ్చాపచ్చాగా బరకగా తిప్పాలి. ఆ తర్వాత అందులోనే మగ్గించిన టమాటా-చింతపండు గుజ్జు, రుచికి సరిపడా మిగిలిన ఉప్పు వేసి.. మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా రోట్లో నూరినట్లు కాస్త పలుకుగా మిక్సీ పట్టి బౌల్‌లోకి తీసుకోవాలి.

పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు, తుంచిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఈ గుమగుమలాడే తాలింపును పల్లీ పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అన్నంలోకి ఎంతో రుచికరమైన 'పల్లీ టమాటా పచ్చడి' సిద్ధం! పొగలు కక్కే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసి, చెంచాడు స్వచ్ఛమైన నెయ్యి వేసుకుని తింటుంటే అమృతతుల్యంగా ఉంటుంది!