
కావలసిన పదార్థాలు: కొర్రమీను చేప ముక్కలు – అర కేజీ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1½ టేబుల్ స్పూన్, కారం పొడి – 1½ నుండి 2 టేబుల్ స్పూన్లు, పసుపు – అర టీస్పూన్, ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – అర టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి – అర టేబుల్ స్పూన్, నిమ్మకాయ – 1 పెద్ద సైజు, బొంబాయి రవ్వ – 1½ నుండి 2 టేబుల్ స్పూన్లు, వంట నూనె – మారినేషన్‌కు 1 టేబుల్ స్పూన్ + వేయించడానికి 4 టేబుల్ స్పూన్లు, తాజా కరివేపాకు – 2 రెమ్మలు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు – 3 నుండి 4, సాల్ట్ – రుచికి సరిపడా.

తయారీ విధానం: పల్చగా కోయించిన కొర్రమీను చేప ముక్కలను ఉప్పు, పసుపు నీటితో శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఒక వెడల్పాటి పళ్లెం లేదా బౌల్‌లో వేసుకోవాలి. ఇందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలి. ఇందులోనే 1 పూర్తి నిమ్మకాయ రసం పిండి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మసాలాలన్నీ ప్రతి ముక్కకు బాగా పట్టేలా 5 నిమిషాలు మర్దన చేస్తూ కలపాలి.

మసాలా పట్టించిన చేప ముక్కలపై 1½ నుండి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను చల్లి.. ముక్కల రెండు వైపులా రవ్వ సమంగా అంటుకునేలా కలపాలి. ఈ మారినేట్ చేసిన చేప ముక్కలపై మూతపెట్టి కనీసం 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.

అరగంట తర్వాత ఫ్రిజ్ నుండి చేప ముక్కలను బయటకు తీయాలి. స్టవ్‌పై వెడల్పాటి నాన్-స్టిక్ పాన్ లేదా పెనం పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి మీడియం వేడిలో కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత మారినేట్ చేసిన చేప ముక్కలను ఒకదానికొకటి అంటుకోకుండా పెనంపై అమర్చాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒకవైపు ఎర్రగా, కరకరలాడేలా వేగిన తర్వాత.. చేప ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా అట్లకాడతో రెండో వైపుకు తిప్పి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలి. చివరగా అదే పాన్ నూనెలో కరివేపాకు రెమ్మలు, చీల్చిన పచ్చిమిర్చి వేసి చిటపటలాడే వరకు వేయించి చేప ముక్కలపై చల్లి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి.

అంతే, నోరూరించే ఆంధ్రా స్టైల్ 'క్రిస్పీ కొర్రమీను చేపల వేపుడు' సిద్ధం! వేడివేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయ చక్రాలు, నిమ్మచెక్కతో నంజుకుని తింటుంటే.. బయట కరకరలాడుతూ, లోపల వెన్నలా మెత్తగా ఉండే చేప రుచితో సాంబారు, రసం అన్నంలోకి లేదా సాయంత్రం స్నాక్‌గా తిరుగులేని ఆనందాన్నిస్తుంది!