
పల్లీల పోషక విలువల విషయానికి వస్తే.. 100 గ్రాముల వేరుశెనగలో సుమారుగా 567 కేలరీలు, 25.8 గ్రాముల ప్రోటీన్, 49.2 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు, 16.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటితో పాటు జీర్ణక్రియకు మేలు చేసే 8.5 గ్రాముల ఫైబర్ ఇందులో లభిస్తుంది. అంతేకాకుండా పొటాషియం (705 మి.గ్రా), ఫాస్ఫరస్ (376 మి.గ్రా), మెగ్నీషియం (168 మి.గ్రా), ఐరన్, విటమిన్లు E, B3 వంటి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు కూడా వేరుశెనగలో పుష్కలంగా ఉంటాయి.

మరోవైపు 100 గ్రాముల బాదంలో సుమారుగా 579 కేలరీలు, 21.2 గ్రాముల ప్రోటీన్, 49.9 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు, 21.6 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే డైటరీ ఫైబర్ (12.5 గ్రాములు) చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేసే విటమిన్ ఇ కలిగి ఉండటమే కాకుండా శరీర శక్తిని పెంచే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం వంటి కీలక ఖనిజాలకు నిలయంగా నిలుస్తుంది.

ప్రతిరోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. ఇందులోని మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులోని అధిక ప్రోటీన్ కండరాల పెరుగుదలకు తోడ్పడగా, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అదనంగా పల్లీల్లోని విటమిన్ బి3 మెదడు పనితీరును ఉత్తేజపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ముడతలు లేకుండా యవ్వనంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

రోజూ గుప్పెడు బాదం పప్పులు తినడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. బాదంలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మ ఛాయ మెరుగుపడటమే కాకుండా కణాలు త్వరగా వృద్ధాప్యానికి గురికాకుండా కాపాడతాయి. బాదంలోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే ఇందులోని ఫైబర్, ప్రోటీన్ ఆకలిని నియంత్రించి, ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడానికి సహాయపడతాయి. అదే సమయంలో వాటిలోని మెగ్నీషియం, రిబోఫ్లేవిన్ మెదడు పనితీరును మెరుగుపరిచి, ఎముకలను బలంగా మారుస్తాయి.

చివరగా ధర, పోషకాల పరంగా దేనిది పైచేయి అంటే.. బాదం పప్పులు ఎక్కువ పోషక విలువలు కలిగి ఉన్నప్పటికీ ఖరీదైనవి. అయితే బాదం కంటే పల్లీలు ప్రోటీన్‌ను, ఆరోగ్య ప్రయోజనాలను చాలా తక్కువ ధరకే సామాన్యులకు సైతం అందిస్తాయి. తక్కువ ఖర్చుతో కండరాలను పెంచుకోవాలని, బలాన్ని పొందాలని ఆశించే వారికి వేరుశెనగలు అద్భుతమైన ఎంపిక. కానీ వేగంగా బరువు తగ్గాలనుకునే వారికి, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించి పొట్ట కొవ్వును కరిగించుకోవాలనుకునే వారికి బాదం బెస్ట్ ఆప్షన్. అయితే వేయించిన, ఉప్పు కలిపిన వాటిని కాకుండా.. 6 నుండి 8 బాదములను రాత్రంతా నీటిలో నానబెట్టి, తొక్క తీసి ఉదయాన్నే పరగడుపున సహజ రూపంలో మితంగా తింటేనే ఆశించిన ఫలితాలు లభిస్తాయి.