
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మటన్ అర కిలో, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె నాలుగు నుండి ఐదు టేబుల్‌స్పూన్లు, బిర్యానీ ఆకు, షాజీరా అర టీస్పూన్, ఉల్లిపాయలు, కారం రుచికి సరిపడ, కొత్తిమీర. మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు: ఒక టీస్పూన్, ఎండుమిర్చి

ముందుగా అర కిలో మటన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మటన్‌ను ప్రెషర్ కుక్కర్‌లోకి తీసుకోవాలి. తర్వాత అందులో టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ఉప్పు, ఒక టేబుల్‌స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అర గ్లాసు నీళ్లు పోసి అన్నింటినీ బాగా కలపాలి. మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. దీని వలన మటన్ తొంభై శాతం వరకు ఉడుకుతుంది. కుక్కర్లోని గాలి పూర్తిగా పోయాక, మటన్ సరిగ్గా ఉడికిందో లేదో ఒకసారి తనిఖీ చేసుకోవాలి.

స్టవ్ ఆన్ చేసి ఒక పాన్‌ను వేడి చేయాలి. అందులోకి ఒక టేబుల్‌స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, మూడు యాలకులు, నాలుగైదు లవంగాలు, ఒక టీస్పూన్ మిరియాలు, నాలుగు ఎండుమిర్చి వేయాలి. మధ్యస్థ మంటపై దోరగా వేయించాలి. ఈ మటన్ ఫ్రైలో మిరియాల రుచి, ఫ్లేవర్ చాలా బాగుంటాయి. మీరు కారం వేయకుండా ఎండుమిర్చిని పెంచవచ్చు. ఇవి వేగిన తర్వాత చల్లారబెట్టి, మిక్సీ జార్‌లో తీసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో నాలుగు నుండి ఐదు టేబుల్‌స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, అర టీస్పూన్ షాజీరా వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలు వేసి మంచి కలర్ వచ్చేవరకు వేయించాలి. ఉల్లిపాయలను గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను మటన్ ఉడికించేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాను కాబట్టి ఇక్కడ మళ్ళీ వేయలేదు. మీకు కావాలంటే ఈ దశలో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయవచ్చు.

ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, మనం ఉడికించి పెట్టుకున్న మటన్‌ను, దానిలోని నీటితో సహా పాన్‌లోకి వేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, ఒకటిన్నర టీస్పూన్ కారం, రుచికి సరిపడా మిగిలిన ఉప్పు వేసి బాగా కలపాలి. అన్ని పదార్థాలు బాగా కలిపిన తర్వాత, హై ఫ్లేమ్‌లో ఐదు నుండి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మరీ డ్రైగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ సేపు ఉడికించవచ్చు.

మీకు ఎంత డ్రైగా ఉడకాలో చూసుకోవాలి. దాని ప్రకారం మటన్ కర్రీని ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పూదీనా వేయాలి. అంటే టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై రెడీ. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి.