
మండు వేసవి… మాడు పగులగొడుతున్న ఎండలు… మనుషులే నీళ్ల కోసం అల్లాడుతున్న వేళ, ఓ వృద్ధుడు మాత్రం మూగజీవాల దాహం తీర్చేందుకు తన జీవితాన్నే అంకితం చేస్తున్నాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని అటవీ ప్రాంతంలో 75 ఏళ్ల ఆదినారాయణ చేస్తున్న సేవ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.

గత ఏడు సంవత్సరాలుగా ప్రతి వేసవిలో నాలుగు నెలల పాటు స్వంత ఖర్చులతో కోతుల కోసం మంచి నీటిని సరఫరా చేస్తున్నారు ఈ పెద్దాయన, అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా కుండీలు ఏర్పాటు చేసి ప్రతిరోజూ వాటిలో నీళ్లు నింపుతూ కోతుల దాహం తీర్చుతున్నారు.

మండుతున్న ఎండల్లో నీటి కోసం అడవుల నుండి బయటకు వచ్చే కోతులకు ఆదినారాయణ చేస్తున్న సేవ జీవనాధారంలా మారింది, వయసు 75 ఏళ్లు దాటినా సేవా భావం మాత్రం తగ్గలేదు, ఎండను లెక్కచేయకుండా తన ఆటోలో ఉన్న నీటి డబ్బాను నింపుకుని అడవి దారుల్లో నడుస్తూ మూగజీవాల కోసం తన వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు

ఈ పెద్దాయన, ఇదే విషయం పై ఆదినారాయణను పలకరించిన టీవీ9 కు ఆయన ఒక మంచి సందేశం ఇచ్చారు, “మూగజీవాలకు సేవ చేయడం నా అదృష్టం ఇది దైవ సంకల్పం, నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు… వెళ్లేటప్పుడు ఏమీ పట్టుకుపోను” అంటూ జీవిత తత్వాన్ని చెప్పారు.

మనుషులు తమ అవసరాల కోసం పరుగులు తీస్తున్న ఈ కాలంలో మాట లేని జీవాల దాహం తీరుస్తూ మానవత్వానికి కొత్త అర్థం చెబుతున్న ఈ వృద్ధుడు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందరూ ఈ పెద్దయాన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి.