
ఖాళీ కడుపుతో టీ తాగడం: చాలామందికి మార్నింగ్ లేచినవెంటనే ఖాళీ కడుపుతో వేడివేడి టీ తాగుతారు. కానీ ఇది అస్సలు మంచిది కాదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అందులోని ఆమ్లాలు కడుపు లైనింగ్‌పై ప్రభావం చూపుతాయి. దీనివల్ల గుండెల్లో మంట, అజీర్ణం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఉదయాన్నే ఒక గ్లాసు నీళ్లు లేదా జీలకర్ర నీళ్లు తాగి, టిఫిన్ చేసిన తర్వాతే టీ తాగడం మంచిది.

ఎక్కువసేపు మరిగించడం: టీ చేసేప్పుడు రుచిగా ఉండాలని చాలామంది టీ పొడిని ఎక్కవసేపు మరిగిస్తారు. ఇలా చేయడం వల్ల టీ పొడిలోని 'టానిన్' అనే రసాయనం ఎక్కువగా విడుదలై టీ చేదుగా మారుతుంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్ణానికి దారితీస్తుంది.అలాగే టీ వడకట్టడానికి ప్లాస్టిక్ గరిటెలను ఉపయోగించడం వల్ల, వేడి టీ తగలగానే ప్లాస్టిక్‌లోని హానికరమైన రసాయనాలు టీలో కలిసి శరీరంలోకి చేరుతాయి. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. అందుకే ప్లాస్టిక్ బదులు స్టీల్ వడకట్టే గరిటెలను వాడడం మంచిది.

పదే పదే వేడి చేయడం: చాలా మంది మార్నింగ్ పెట్టిన టీని.. ఈవినింగ్ వచ్చాక వేడి చేసుకొని తాగుతూ ఉంటారు. కానీ ఒకసారి చేసిన టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల టీలో యాసిడ్ పరిమాణం పెరిగి, కడుపునొప్పి, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి టీని ఎప్పటికప్పుడూ ఫ్రెష్‌గా పెట్టుకొని మాత్రమే తాగండి.

మధ్యాహ్నం, రాత్రి వేళల్లో టీ తాగడం: కొంతమందికి మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఈఅలవాటు మంచిది కాదు. ఎందుకంటే టీలోని కెఫిన్, టానిన్లు మనం తిన్న ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. అలాగే రాత్రి పూట టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి ఈ అలవాటు మానుకోవడం మంచింది.

ముందే పాలు పోయడం: టీ చేసేటప్పుడు చాలామంది గిన్నెలో ముందే పాలు పోస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. పాలలోని ప్రొటీన్లు యాంటీ ఆక్సిడెంట్లను బంధిస్తాయి. అందుకే మొదట నీళ్లలో టీ పొడి వేసి బాగా మరిగించి, ఆ తర్వాత మిగిలిన పదార్థాలు వేసి, చివర్లో పాలు పోయాలి.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని tv9 దృవీకరిచడం లేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)