
గుడ్డు పెంకులు: బల్లులను ఇంట్లోంచి తరిమికొట్టడానికి ఇది అత్యంత ప్రాచీనమైన, ప్రభావవంతమైన చిట్కా. గుడ్ల పెంకులను బల్లులు తరచుగా తిరిగే మూలల్లో లేదా కిటికీల వద్ద ఉంచాలి. గుడ్డు పెంకులలో ఉండే ఘాటైన వాసన బల్లులకు అస్సలు పడదు. పైగా ఏదో పెద్ద ప్రాణి లేదా పక్షి ఉందనే భయంతో అవి ఆ ప్రాంతానికి రావు. అయితే, ఈ పెంకులను ప్రతి 2-3 వారాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి.

ఉల్లిపాయ, వెల్లుల్లి: ఉల్లిపాయలు, వెల్లుల్లిలోని ఘాటైన వాసనను బల్లులు తట్టుకోలేవు. వెల్లుల్లిపాయలను లేదా ఉల్లిపాయ ముక్కలను తీసి గుమ్మాలు, కిటికీల దగ్గర వేలాడదీయవచ్చు. లేదా ఉల్లిపాయ రసం, వెల్లుల్లి రసాన్ని నీటిలో కలిపి స్ప్రే సీసాలో పోసి బల్లులు సంచరించే గోడల మూలల్లో స్ప్రే చేస్తే అవి వెంటనే పారిపోతాయి.

మిరియాల స్ప్రే: నల్ల మిరియాల పొడి బల్లులపై చాలా బాగా పనిచేస్తుంది. నీటిలో కొద్దిగా నల్ల మిరియాల పొడి, కారం పొడి కలిపి బాగా కదిలించాలి. ఈ మిశ్రమాన్ని బల్లులు ఎక్కువగా దాక్కునే స్థలాలు, విద్యుత్ బోర్డుల వెనుక, లైట్ల దగ్గర స్ప్రే చేయాలి. ఈ మిరియాల ఘాటు బల్లుల కళ్ళు, చర్మానికి చికాకు కలిగిస్తుంది, దీంతో అవి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోతాయి.

కాఫీ పొడి, పొగాకు: కాఫీ పొడి, పొగాకు పొడిని సమానంగా తీసుకొని, కొద్దిగా నీరు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఈ ఉండలను మ్యాచ్ బాక్స్ లేదా టూత్‌పిక్‌కి గుచ్చి బల్లులు తిరిగే ప్రాంతాలలో ఉంచాలి. ఈ వాసన బల్లులకు విషపూరితంగా మారి వాటిని దూరంగా ఉంచుతుంది.

ఐస్ వాటర్: బల్లులు శీతల రక్త జంతువులు. ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు వస్తే అవి తమ శరీరాన్ని కదల్చలేవు. కాబట్టి, బల్లి కనిపిస్తే దానిపై బాగా చల్లటి నీటిని చల్లాలి. నీటి చల్లదనానికి అది తాత్కాలికంగా పక్షవాతం వచ్చినట్లు కదల్లేకుండా ఉండిపోతుంది. ఆ సమయంలో దానిని సులభంగా పట్టుకుని ఇంటి బయట పడేయవచ్చు. ఈ చిన్నపాటి సహజ చిట్కాలను పాటిస్తే, కెమికల్స్ వల్ల అయ్యే ఆరోగ్య సమస్యలు లేకుండా మీ ఇంటిని బల్లుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు!