
వేద పంచాంగం ప్రకారం 2026లో మార్చి 4న దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. రంగుల సందడి, మిఠాయిల రుచులు మాత్రమే కాదు.. ఇంటి శుభ్రత, సానుకూలత, శాంతి కూడా ఈ పవిత్ర పండుగలో ముఖ్యమైన భాగాలు. వాస్తు శాస్త్రం ప్రకారం, హోలీకి ముందు ఇంటిని శుభ్రపరచి కొన్ని అనవసర వస్తువులను తొలగించడం వల్ల శుభశక్తి ప్రవాహం పెరిగి, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం. ఇంటి శుభ్రపరచడం కేవలం దుమ్ము, ధూళిని తొలగించడమే కాదు; ప్రతికూల శక్తిని దూరం చేసి, కొత్త ఆశలు, సానుకూలతను ఆహ్వానించే ప్రక్రియ కూడా. అందుకే హోలీకి ముందు ఈ క్రింది విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిదని వాస్తు సూచిస్తుంది.

1. ఎండిపోయిన మొక్కలను తొలగించండి.. వాస్తు ప్రకారం ఇంట్లో ఎండిన లేదా చనిపోయిన మొక్కలు ఉండటం ప్రతికూలతకు సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా తులసి, మనీ ప్లాంట్ వంటి పవిత్ర లేదా శుభప్రదమైన మొక్కలు ఎండిపోతే వెంటనే తొలగించాలి. వాటి స్థానంలో కొత్త ఆకుపచ్చ మొక్కలను నాటడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.

2. పాత, చిరిగిన చెప్పులు, బూట్లు చాలా పాతవి లేదా ఉపయోగించలేని చెప్పులు, బూట్లు ఇంట్లో నిల్వ ఉంచడం మంచిది కాదు. వాస్తు నమ్మకాల ప్రకారం ఇవి మానసిక ఒత్తిడి, అశాంతి, ప్రతికూల శక్తిని పెంచుతాయి. హోలీకి ముందు అలాంటి వస్తువులను తొలగించడం ద్వారా ఇంటిని శుభ్రంగా, తేలికగా ఉంచవచ్చు.

3. పగిలిన గాజు, అద్దాలు.. పగిలిన అద్దాలు లేదా గాజు వస్తువులు ఇంట్లో ఉంచడం అశుభంగా భావిస్తారు. ఇవి సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయని వాస్తు చెబుతోంది. అలాంటి వస్తువులను హోలీకి ముందు తొలగించడం ద్వారా వాస్తు దోషాలు తగ్గుతాయని విశ్వసిస్తారు.

4. విరిగిన దేవుడి విగ్రహాలు హోలీ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు కాబట్టి, ఇంట్లో ఉన్న విరిగిన లేదా దెబ్బతిన్న దేవతా విగ్రహాలను గౌరవంగా తొలగించాలి. మత విశ్వాసాల ప్రకారం అవి ఇంట్లో ఉంచడం శుభకరం కాదు. వాటిని పవిత్ర జలాల్లో నిమజ్జనం చేయడం, రావి చెట్టు కింద భక్తితో ఉంచడం లేదా సమీప ఆలయానికి సమర్పించడం మంచిదిగా భావిస్తారు.

హోలీ పండుగ కేవలం రంగుల ఆట మాత్రమే కాదు.. అది మనసును, మన ఇంటిని, మన జీవన విధానాన్ని శుభ్రపరచుకునే అవకాశం కూడా. వాస్తు సూచనల ప్రకారం, హోలీకి ముందు ఇంటిని శుభ్రపరచి అనవసర, ప్రతికూల వస్తువులను తొలగిస్తే, ఆనందం, శాంతి, శ్రేయస్సు, సానుకూల శక్తి మన ఇంట్లో నిలుస్తాయని నమ్ముతారు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు వివిధ వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీన్ని విశ్వసించడం మీ వ్యక్తిగతం. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)