
ఎండలు మండిపోతున్నాయి.. ఇంట్లో ఏసీ ఉన్నా లేకపోయినా, ప్రతి ఒక్కరికీ కావాల్సింది సీలింగ్ ఫ్యాన్. అయితే మార్కెట్లోకి వెళ్తే రకరకాల డిజైన్లు, రెక్కల సంఖ్యతో ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి. మన దేశంలో ఎక్కువగా 3 రెక్కల ఫ్యాన్లు కనిపిస్తాయి, కానీ ఈ మధ్య 4, 5 రెక్కల ఫ్యాన్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ ఫ్యాన్ వేగంగా తిరుగుతుంది? ఏది కరెంట్ బిల్లును తగ్గిస్తుంది?అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

3 రెక్కల ఫ్యాన్: దేశంలోని మధ్యతరగతి ఇళ్లలో 90శాతం ఇవే కనిపిస్తాయి. దీనికి కారణం లేకపోలేదు. రెక్కలు తక్కువగా ఉండటం వల్ల గాలిలో ఘర్షణ తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫ్యాన్ చాలా వేగంగా తిరుగుతూ, గదిని త్వరగా చల్లబరుస్తుంది. మోటారుపై భారం తక్కువగా ఉండటం వల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా ఎక్కువ గాలిని అందిస్తాయి.

4 రెక్కల ఫ్యాన్: మీకు ఫ్యాన్ గాలి కావాలి కానీ, ఆ 'రెరెరె' అనే శబ్దం నచ్చదా? అయితే 4 బ్లేడ్ల ఫ్యాన్ మీకోసం. ఈ ఫ్యాన్లు 3 రెక్కల ఫ్యాన్ల కంటే కొంచెం తక్కువ వేగంతో తిరిగినప్పటికీ గాలి ప్రవాహం చాలా మృదువుగా ఉంటుంది. బెడ్ రూమ్స్, ఏసీ ఉన్న గదుల్లో ఇవి చాలా బాగుంటాయి. గాలి ప్రవాహం మరియు లుక్ పరంగా ఇవి ఒక బ్యాలెన్స్‌డ్ ఆప్షన్‌గా నిలుస్తాయి.

5 రెక్కల ఫ్యాన్: పాతకాలపు మహారాజుల కాలం నాటి లుక్ రావాలన్నా, గది అందంగా కనిపించాలన్నా ఇవి బెస్ట్. ఇవి ప్రధానంగా డెకరేటివ్ పర్పస్ కోసం రూపొందించినవి. రెక్కల సంఖ్య పెరగడం వల్ల మోటారుపై ఒత్తిడి పెరిగి, ఫ్యాన్ వేగం తగ్గుతుంది. ఇవి నెమ్మదిగా తిరుగుతూ గాలిని గది అంతా సమానంగా పంపిణీ చేస్తాయి కానీ 3 రెక్కల ఫ్యాన్ లాగా స్పీడ్ గాలిని ఇవ్వలేవు. మోటారు ఎక్కువ శ్రమ పడాల్సి రావడం వల్ల కరెంట్ వినియోగం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

ఏది బెస్ట్..?: ఖచ్చితంగా 3 రెక్కల ఫ్యాన్ మాత్రమే విద్యుత్ ఆదా చేయడంలో ముందుంటుంది. దాని ఏరోడైనమిక్ డిజైన్ వల్ల తక్కువ పవర్‌తో ఎక్కువ గాలిని ఇస్తుంది. ఒకవేళ మీరు విద్యుత్ ఆదా గురించి ఆలోచిస్తే, బ్లేడ్ల సంఖ్యతో పాటు BEE స్టార్ రేటింగ్ ఉన్న ఫ్యాన్లను ఎంచుకోవడం ఉత్తమం.