
కావాల్సిన పదార్థాలు: అటుకులు: 1 కప్పు, పాలు: 2 కప్పులు, నీళ్లు: 1 కప్పు (పాల కోసం), పావు కప్పు (బెల్లం సిరప్ కోసం), తురిమిన బెల్లం: ముప్పావు కప్పు, నెయ్యి: 2 టీ స్పూన్లు, యాలకుల పొడి: చిటికెడు, డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, కిస్మిస్, ఎండుకొబ్బరి/పచ్చికొబ్బరి ముక్కలు): కొద్దిగా తీసుకోవాలి.

ముందుగా, ఒక బౌల్‌లో ముప్పావు కప్పు తురిమిన బెల్లం తీసుకొని, పావు కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, మరో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, వేడిగా ఉన్నప్పుడే బెల్లం సిరప్‌ను ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ సిరప్ పూర్తిగా చల్లారనివ్వాలి. బెల్లంలోని మలినాలను తొలగించడానికి వడకట్టడం అవసరం.

మరొక బౌల్‌లో రెండు కప్పుల పాలు, ఒక కప్పు నీళ్లు పోసి ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. పాలను పక్క స్టవ్ మీదకు మార్చుకోవచ్చు. ఇప్పుడు, ఒక పాన్ పెట్టి అందులో రెండు టీ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం రంగు మారిన తర్వాత, కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించాలి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఎండుకొబ్బరి లేదా పచ్చికొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి, వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.

అదే పాన్‌లో ఒక కప్పు లావు అటుకులు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో అటుకులను క్రిస్పీగా మారే వరకు వేయించుకోవాలి. అటుకులు కరకరలాడే వరకు వేగితేనే పాయసం రుచిగా ఉంటుంది. అటుకులు వేగాయో లేదో తెలుసుకోవడానికి, ఒక అటుకును తీసుకొని నొక్కితే అది సులువుగా విరిగిపోవాలి.వేయించిన అటుకులను మనం కాచి పెట్టుకున్న పాలల్లో పోయాలి. మీడియం ఫ్లేమ్‌లో అటుకులు బాగా మెత్తబడే వరకు ఉడికించాలి. ఈ దశలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అటుకులు మెత్తబడుతున్నప్పుడు, మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలను కూడా వేసి కలపాలి.

అటుకులు చక్కగా ఉడికి, చేత్తో నొక్కితే సాఫ్ట్‌గా మారిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం పల్చగానే ఉంటే, ఆరాక చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, చివరగా ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పాయసం మిశ్రమాన్ని స్టవ్ నుండి పక్కకు తీసుకొని, మనం ముందుగా ఫిల్టర్ చేసి చల్లార్చిన బెల్లం సిరప్‌ను వేసి బాగా కలపాలి. స్టవ్ ఆన్‌లో ఉన్నప్పుడు బెల్లం సిరప్ కలిపితే కొన్నిసార్లు పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి కలిపితే మంచిది. కలిపిన తర్వాత, మూత పెట్టి ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి, అటుకులు బెల్లం సిరప్‌ను పీల్చుకొని మరింత రుచిగా మారతాయి.