MAHARASHTRA POLITICS: బీజేపీ వ్యూహం అదుర్స్.. ‘మహా’పాలిటిక్స్‌లో సుదీర్ఘవ్యూహానికి తెరలేపిన కాషాయదళం

దేవేంద్ర ఫడ్నవిస్ ఉపముఖ్యమంత్రిస్థాయికి ఓ మెట్టుదిగడం ద్వారా ఎక్కడ తగ్గాలో కూడా తనకు తెలుసని చాటుకున్నారు. ఇంతకీ మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ.. 50 మంది ఎమ్మెల్యేల మద్దతున్న ఓ వ్యక్తిని సీఎంని చేయడం వెనుక ఏవ్యూహం దాగుంది?

MAHARASHTRA POLITICS: బీజేపీ వ్యూహం అదుర్స్.. ‘మహా’పాలిటిక్స్‌లో సుదీర్ఘవ్యూహానికి తెరలేపిన కాషాయదళం
Political
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 05, 2022 | 8:30 AM

MAHARASHTRA POLITICS BJP STRATEGY SUPERB LONGTERM PLAN STARTS: మహారాష్ట్ర పాలిటిక్స్‌లో పక్షం రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు జులై 4వ తేదీన ఓ కొలిక్కి వచ్చాయి. పలు నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శివసేన (Sivsena) రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) రాష్ట్ర అసెంబ్లీలో బలనిరూపణలో నెగ్గడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులు, చేర్పులకు తెరపడింది. కానీ.. అదేసమయంలో మహారాష్ట్ర రాజకీయాల్లో మరింత బలమైన శక్తిగా మారేందుకు బీజేపీ ప్రారంభించిన మిషన్ 2024కి తెరలేచింది. మహారాష్ట్రలో నాలుగు ప్రధాన పార్టీలలో బీజేపీ, శివసేన ఒక జట్టుగాను, ఎన్సీపీ (NCP), కాంగ్రెస్ పార్టీ (Congress Party)లు మరో జట్టుగానూ వుండేవి. కానీ 2019 ఎన్నికల తర్వాత బీజేపీకి హ్యాండిస్తూ .. ఆ పార్టీని ఏకాకిని చేస్తూ శివసేన.. తమకు చిరకాల ప్రత్యర్థులైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో జట్టు కట్టింది. దాంతో ఆ మూడు పార్టీలు అధికార పక్షంగాను.. అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వున్న భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ప్రతిపక్ష పార్టీగాను మిగిలాయి. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే (Uddav Thakre) మాట మార్చి.. తన తండ్రి బాలా సాహెబ్ ఠాక్రే (Bala Saheb Thakre) ఆజన్మాంతం వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. బాలా సాహెబ్ ఠాక్రేని కలిసేందుకు ఆయనింటికి వినమ్రంగా వచ్చే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) చెంతకు ఆల్ మోస్ట్ రోజూ ఓ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి సాగిలపడే దుస్థితికి ఉద్ధవ్ ఠాక్రే దిగిపోయారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు సమైక్యంగా ఏర్పాటు చేసిన మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వానికి పేరుకే సారథిగా పరిమితమైపోయి, పూర్తి పవర్ సెంటర్‌గా శరద్ పవార్ మారిపోయేలా ఉద్ధవ్ ఠాక్రే మెతక వైఖరి కారణమైంది. దానికితోడు సంకీర్ణ ప్రభుత్వం కావడంతో చిరకాలంగా పార్టీకి ప్రాణవాయువుగా వున్న హిందుత్వను ఉద్ధవ్ పూర్తిగా పక్కన పెట్టారు. ఎంతలా అంటే అజాన్, హనుమాన్ చాలీసా (Hunaman Chalisa) విషయంలో పూర్తిగా హిందూ వ్యతిరేక స్టాండ్‌ను తీసుకునే స్థాయికి ఉద్ధవ్ ఠాక్రే దిగజారారు. ఇది శివసేనికుల్లో చాలా మందికి నచ్చకపోయినా మౌనంగా వుండిపోయారు. మరోవైపు హనుమాన్ చాలీసీ విషయంలో గళమెత్తిన ఎంపీ, నటి నవనీత్ కౌర్ (Navneet Kaur) దంపతులను 15 రోజుల పాటు జైల్లో పెట్టడం హిందుత్వవాదుల్లో మంట రగిలించింది. మరోవైపు 2019లో హడావిడిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. రెండు, మూడురోజుల్లోనే దిగిపోయిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) అదను కోసం ఎదురు చూస్తూనే వున్నారు. ఈక్రమంలోనే ఏక్‌నాథ్ షిండే లాంటి హార్డ్‌కోర్ హిందుత్వవాదిని బీజేపీ నేతలు ఎంచుకున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి షిండే రెబెల్స్ క్యాంపు కొనసాగినంత కాలం బీజేపీ అధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి షిండే వర్గం మద్దతునివ్వడం ద్వారా మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగాను, షిండే డిప్యూటీ సీఎంగాను ప్రభుత్వం ఏర్పాటవుతుందని అందరు భావించారు. కానీ బీజేపీ మాస్టర్ స్ట్రోక్.. దూరాలోచనతో కొన్ని గంటల వ్యవధిలో పరిస్థితి మారిపోయింది. సీఎంగా చేసిన దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఓ మెట్టుదిగేలా ఒప్పించడం ద్వారా బీజేపీ అధినాయకత్వం మహారాష్ట్రలో తాము అవలంభించబోయే సుదీర్ఘ వ్యూహానికి తెరలేపింది. దేవేంద్ర ఫడ్నవిస్ ఉపముఖ్యమంత్రిస్థాయికి ఓ మెట్టుదిగడం ద్వారా ఎక్కడ తగ్గాలో కూడా తనకు తెలుసని చాటుకున్నారు. ఇంతకీ మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ.. 50 మంది ఎమ్మెల్యేల మద్దతున్న ఓ వ్యక్తిని సీఎంని చేయడం వెనుక ఏవ్యూహం దాగుంది?

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 మంది సభ్యులున్నారు. అందులో బీజేపీ తరపున 106 మంది గెలిచారు. మొత్తమ్మీద ఎన్డీయేకు 113 మంది సభ్యలున్నారు. మరోవైపు శివసేనకు 55 మంది, ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్ పార్టీకి 44 మంది చొప్పున ఎమ్మెల్యేలున్నారు. షిండే రూపంలో శివసేనలో చీలిక రాగా.. ఏకంగా 39 మంది ఎమ్మెల్యేలు రెబెల్ గ్రూపుగా మారిపోయారు. బీజేపీ మద్దతులో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇపుడు మెజారిటీ సేన ఎమ్మెల్యేలు షిండే వెంట వున్న తరుణంలో శివసేన పార్టీ మనుగడ ఏంటన్నది తేలాల్సి వుంది. అందుకు అటు ఉద్ధవ్ వర్గం, ఇటు షిండే వర్గం న్యాయపోరాటం చేయడం ఖాయం. ఈ పోరాటం సుదీర్ఘ కాలం కొనసాగడం ఖాయం. శివసేన తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో రెండింట మూడొంతుల (2/3) షిండే చెంతనే వున్నారు. ఆక్రమంలో షిండే వర్గానికి పార్టీ, పార్టీ గుర్తు దక్కుతాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఠాక్రే కుటుంబానికే శివసేన పార్టీ మీద పట్టు వుంటుందా ? లేక చీలిక వర్గానికి సారథిగా వున్న షిండే పూర్తి స్థాయిలో శివసేన పగ్గాలను దక్కించుకున్నా కూడా పార్టీ క్యాడర్ దాన్ని స్వీకరిస్తారా? ఇలాంటి ప్రశ్నలకిపుడే సమాధానం కనిపించడం లేదు. కానీ బీజేపీ మాత్రం శివసేన ఉనికిని నామమాత్రం చేసేందుకే సీఎం సీటును త్యాగం చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షెడ్యూలు ప్రకారం చూస్తే మహారాష్ట్ర అసెంబ్లీకి 2024 రెండో భాగంలో ఎన్నికలు జరగాల్సి వుంది. ఈలోగా శివసేన రెబల్ వర్గం, ఉద్ధవ్ వర్గాల మధ్య న్యాయపోరాటం ఒక కొలిక్కి వస్తే దానిని బట్టి బీజేపీ వ్యూహం మారే అవకాశాలున్నాయి. నిజానికి బీజేపీ నేతల మాటలను బట్టి చూస్తే ఇప్పటి వరకు మహా రాజకీయాల్లో జరిగింది కేవలం ట్రయలే. ఇకముందే అసలైన సినిమా వుందంటున్నారు కమలనాథులు. ముందు ముందు పెద్ద సినిమా చూపించేందుకే సీఎం స్థాయి వ్యక్తిని ఓ మెట్టు తగ్గించి డిప్యూటీని చేశామంటున్నారు. మహారాష్ట్ర పాలిటిక్స్‌లో ఇదివరకు ఇద్దరు నేతలు ముందు సీఎంగా చేసి.. ఆ తర్వాత డిప్యూటీలుగా మారిన ఉదంతాలున్నాయి. వారిద్దరు తక్కువ స్థాయి వ్యక్తులేం కాదు. వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ ఒకరైతే.. ఇంకొకరు శివసేన రెబల్ నేత నారాయణ రాణే. రాణే ఇపుడు బీజేపీలో వుంటూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికలయ్యేదాకా నమ్మకంగా వున్న ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్నికలు కాగానే తమకు ద్రోహం చేశారని కమలం నేతలు ఇప్పటికీ గుర్రుగా వున్నారు. దానికి ప్రతీకారంగా ఠాక్రేకు పెద్ద దెబ్బ కొట్టేందుకే రెడీ అయ్యారు. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఏక్‌నాథ్ షిండేను ఎంచుకున్నారు. దాని వల్ల ఈ ఏడాది జరగబోయే బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల్లో తమ అలయెన్స్ గెలిచేలా వ్యూహరచన చేశారు. అక్టోబర్ నాటికి బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అతిపెద్దపార్టీగా తామే సీఎం సీటును తీసుకుంటే సగటు శివసైనికుడు అధికారం తమనుంచి బీజేపీ లాక్కుందన్న కంక్లూజన్‌కు వచ్చే ప్రమాదం వుందని, అది భవిష్యత్తు ఎన్నికల్లో తమ అలయెన్స్‌కు ప్రతికూలంగా పరిణమించే అవకాశం వుందని బీజేపీ అధినాయకత్వం అంచనా వేసింది. అందుకే సీఎం సీటును ఏక్‌నాథ్‌కు వదిలేసింది. తద్వారా శివసేనికులకు తన దారికి తెచ్చుకోవడం ద్వారా శివసేన పార్టీపై పూర్తి పట్టును షిండే సాధించుకునే వెసులుబాటును కల్పించింది. డిప్యూటీ సీఎం హోదాలో ఆ టాస్క్ ఆయనకు తలకు మించిన పని అవుతుందన్న వ్యూహంతోనే సీఎం సీటును ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది. బీఎంసీ ఎన్నికల్లో సత్తా చాటితే షిండే నాయకత్వంపై బీజేపీకి గురి కుదురతుంది. ఠాణే, కల్యాణ్, డోంబివలి వంటి ముంబయి శివారు ప్రాంతాల్లో షిండేకు మంచి పట్టుంది. దానికితోటు సీఎం చరిష్మా తోడైనే ఠాక్రే కుటుంబాన్ని నిలువరించి మరీ బిఎంసీలో సత్తా చాటే అవకాశం వుందంటున్నారు. అదేసమయంలో పార్టీ గుర్తు కోసం జరిగే లీగల్ బ్యాటిల్లో రెబల్స్‌కు మద్దతు పెరగాలంటే సీఎం కుర్చీ షిండే దక్కడమే సరైన నిర్ణయంగా బీజేపీ అధినాయకత్వం భావించింది. పార్టీ గుర్తును, పార్టీ నిధులను ఉద్ధవ్ ఠాక్రే‌ నుంచి దూరం చేస్తే సగం విజయం సాధించినట్లే అని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది. నిజానికి 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రే.. బీజేపీకి హ్యాండిచ్చి మరీ కాంగ్రెస్‌, ఎన్సీపీలతో జత కట్టేందుకు మొగ్గుచూపారు. దీంతో హిందుత్వకు తానే సారథిగా చెప్పుకునేలా అయాచిత వరం బీజేపీకి దక్కింది. మరోవైపు తమ పునాదులు దెబ్బతింటాయనే భయం శివసేన నాయకుల్లో అంతర్గతంగా పెరిగిపోవడమే తిరుగుబాటుకు కారణమైందని తెలుస్తోంది. ఇది కూడా ఓ రకంగా కమలనాథులకు కలిసొచ్చే అంశమేనంటున్నారు. శివసేన కేడర్‌లో చీలికలు ఆ పార్టీని వీక్ చేస్తాయి. భవిష్యత్తులో షిండే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే‌ వర్గాలకు ఎన్నికల్లో విజయాలు అంత తేలికగా దక్కే అవకాశం లేనంతగా బీజేపీ ఎదగాలని కమలం నేతలు ప్లాన్ చేశారు. మహారాష్ట్రలో హిందుత్వానికి ఏకైక ప్రతినిధిగా బీజేపీ మారితే.. ఆ రాష్ట్రంపై పట్టు సుదీర్ఘకాలం కొనసాగుతుందని కాషాయ శిబిరం భావిస్తున్నట్లు తెలుస్తోంది.