Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. నవంబర్ మూడో వారం నుంచి డిసెంబర్ రెండో వారం మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఇంకా మూడు నెలల గడువు వుంది. రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నా మూడు పార్టీలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అధికార భారత రాష్ట్ర సమితిని ఢీ కొనేందుకు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు సమాయత్తమవుతున్నాయి. విపక్షాలను ఎదుర్కొనేందుకు తన దగ్గర ఇంకా ఎన్నో అస్త్రాలున్నాయని తాజాగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇటీవల అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే పలు డిక్లరేషన్లను ప్రకటించి ఓటర్లకు వరాలను ప్రకటించింది. ప్రియాంక గాంధీ వస్తే మహిళా డిక్లరేషన్ వెల్లడించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్దమవుతున్నారు. మహిళా డిక్లరేషన్‌లో కర్నాటకలో ప్రకటించినట్లుగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తాయిలంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూనే సంక్షేమం పేరిట వరాల జల్లు కురిపిస్తోంది. మొన్నటి వరకు మూడు వేల రూపాయలుగా వున్న దివ్యాంగుల పెన్షన్‌ని రూ. 4,016కు పెంచారు. 43 వేల ఆర్టీసీ కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపుతూ వారి చిరకాల కోరికను తీర్చింది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది కేసీఆర్ సర్కార్. మరోవైపు లక్షల్లో వున్న ప్రభుత్వ ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు త్వరలో వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ)ని వేయనున్నట్లు సీఎం వెల్లడించారు. అయితే, పీఆర్సీ నివేదిక వచ్చేలోగా సమయం పడుతుంది కాబట్టి ఎన్నికలకు ముందే మధ్యంతర ఉపశమనం (ఐ.ఆర్.)ని ప్రకటిస్తామని కూడా చెప్పేశారు. ఇలా ఎన్నికలే లక్ష్యంగా సీఎం ఓట్ల వేటకు సిద్దమవుతున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ కూడా తెలంగాణకు తామేం చేశామో చాటుకునేందుకు యధాశక్తి ప్రయత్నిస్తోంది. ఇటీవల వరంగల్ సభకు వచ్చిన ప్రధాని మోదీ గత 9 ఏళ్ళలో తెలంగాణకు తమ ప్రభుత్వం చేసిన ప్రయోజనాలను వివరించారు. రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రెండ్రోజుల క్రితం తెలంగాణలో 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ప్రజలకు మేళ్ళు చేస్తూ వారిని మచ్చిక చేసుకుంటున్న రాజకీయ పార్టీలు తాజాగా గెలుపు గుర్రాల ఎంపికపై దృష్టి సారించాయి.
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి విపక్షాలకు ప్రిపరేషన్ టైం లేకుండా చేసి.. ఘన విజయం సాధించిన కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక కోసం ఓవైపు ఇంటలిజెన్స్ నివేదికలను తెప్పించుకుంటూనే ప్రయివేటు సర్వే సంస్థల నివేదికలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్ బృందంతో ఇదివరకే రెండు సార్లు సర్వే చేయించినట్లుగా తెలుస్తోంది. ఆయన లిస్టులో నెగెటివ్ రిపోర్టు వచ్చిన వారికి ఇదివరకే కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మూడు నెలల వ్యవధిలో మరోసారి ఐ-ప్యాక్ టీమ్ సర్వే జరిపి కేసీఆర్‌కు రిపోర్టిచ్చింది. తాజా రిపోర్టులో నెగెటివ్ వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాకిస్తారని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు నెలాఖరు నాటికే సగానికిపైగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది. అధిక మాసం కావడంతో కేసీఆర్ సెంటిమెంటు పరంగా కొంత ఆలోచిస్తున్నారని, లేకపోతే ఆగస్టు 12 లేదా 13 తేదీలలోనే ఏకంగా 87 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే వారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అధిక మాసంలో ఎందుకనుకుంటే మాత్రం ఆగస్టు 17 తర్వాత ఏ క్షణమైనా బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం. అయితే, ఈ జాబితాలో సిట్టింగులందరికీ ఛాన్సిస్తారా లేక కొందరికి మొండిచేయి చూపుతారా అన్న ఆసక్తి రేపుతోంది. సిట్టింగుల్లో ఎవరికైనా టిక్కెట్ దక్కకుంటే వారు ప్రత్యర్థి పార్టీల వైపు చూసే అవకాశాలుండడంతో వారితో ముందుగానే ఓ మాట చెప్పడం ద్వారా వారి భవిష్యత్‌పై భరోసా కల్పించాలని కూడా కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018లో అనూహ్య నిర్ణయంతో ముందస్తుకు వెళ్ళిన కేసీఆర్… ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. సెప్టెంబర్ నెలలోనే అభ్యర్థులను ప్రకటించి.. గ్రౌండ్ వర్క్ చేసుకోమని వారికి చెప్పారు. తెలంగాణలో 119 సీట్లుండగా ఎన్నికలకు మూడు నెలల ముందుగానే ఏకంగా 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేశారు ఆనాడు. తాజాగా 80 నుంచి 87 సీట్లకు అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. ఆగస్టు మూడో వారం కల్లా జాబితాను వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇక కర్నాటక ఫలితాల తర్వాత దూకుడు పెంచిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేశారు. అయితే అంతర్గత ప్రజాస్వామ్యం కొద్దిగా ఎక్కువ పాళ్ళలో వుండే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను ముందస్తుగా ప్రకటిస్తే వచ్చే కష్టనష్టాలను పార్టీ రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ బృందం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎన్నికల కమిటీలో ఏకాభిప్రాయం కుదిరిన 35 నుంచి 40 మందితో ఆగస్టు చివరి వారంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్దమవుతున్నది. కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా అనుసరించిన వ్యూహాన్నే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. తన ఎంపిక కూడా సర్వే రిపోర్టు ఆధారంగానే జరుగుతందని రేవంత్ చెప్పడం కొంత అతిశయోక్తే అయినా ఆ పార్టీ సర్వేలనే నమ్ముకుంటోందని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. ఇక ఇంకోవైపు బీజేపీ కూడా 30 నుంచి 40 సీట్లకు అభ్యర్థులను ముందే ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మెన్ ఈటల రాజేందర్‌ని ఆగస్టు 8న బీజేపీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిటీని ఇటీవలనే బీజేపీ నియమించుకుంది. అయితే, టీ.బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందిన బండి సంజయ్ కుమార్, ఎన్నికల కమిటీ సారథి ఈటల రాజేందర్, బీజేపీ ఓబీసీ సెల్ ఛైర్మెన్ డా. కే.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డి.కే. అరుణల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన అభ్యర్థుల పేర్లతో ముందుగానే జాబితాను ప్రకటిస్తే ఎలాంటి సమస్య వుండదని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే బీజేపీ అభ్యర్థుల జాబితా కూడా ఆగస్టు నెలాఖరుకే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.