Breaking News
  • విశాఖ: సింహాద్రి అప్పన్నస్వామికి స్వర్ణ తులసీ దళాలు సమర్పణ. రూ.25 లక్షలు విలువైన 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన బోకం శ్రీనివాసరావు దంపతులు. గతంలోనూ పలు కానుకలు సమర్పించిన శ్రీనివాసరావు.
  • అమరావతి: ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ. మత్స్యకారులకు చేయూతనివ్వాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్పొరేట్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద 2శాతం చెల్లించాలని కోరిన మంత్రి. గతంలో రూ.150 కోట్లు ఇస్తామని ఓఎన్‌జీసీ, గెయిల్‌ అంగీకారం. బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరిన పెద్దిరెడ్డి. ఆయిల్ నిక్షేపాల వెలికితీత సమయంలో మత్స్య సంపదకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
  • తిరుపతి: మీడియాతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చిట్‌చాట్‌. పీసీసీ చీఫ్‌ పదవి మీడియా ఊహగానాలేనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌ పదవిపై అంతగా ఆసక్తి లేదన్న మాజీ సీఎం. తాజా రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి. తాను తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానన్న కిరణ్‌. చిత్తూరు జిల్లాలో తాను ప్రారంభించిన తాగు, సాగు నీరు ప్రాజెక్టు కొనసాగించకపోవడం పట్ల ఆవేదన. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించకపోవడంపై అసంతృప్తి.
  • సైదాబాద్‌ పీఎస్‌లో అక్బరుద్దీన్‌పై కేసునమోదు. అక్బరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు. భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన అక్బరుద్దీన్‌. న్యాయవాది కరుణసాగర్‌ ఫిర్యాదుతో కేసునమోదు.
  • గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన నేతల పర్యటన. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలకు పరామర్శ. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ. గురజాల డీఎస్పీ శ్రీహరిని కలిసిన జనసేన నేతలు. గొడవతో సంబంధం లేని వారిని కేసుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి. గురజాల సబ్‌జైలులో ఉన్న ధర్మవరం జనసైనికులకు పరామర్శ.
  • తూ.గో: రాజమండ్రి దగ్గర పురాతన హెవలాక్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్‌, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌. హెవలాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దనున్న ప్రభుత్వం. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుడ్‌బజార్‌, ఫ్యాషన్‌ బజార్లకు ఏర్పాటు. 40 అడుగుల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఎండీ ప్రవీణ్‌కుమార్‌.

ప్రాంతీయ భాషలే పట్టుగొమ్మలు

one nation one language no hindi with pressure, ప్రాంతీయ భాషలే పట్టుగొమ్మలు

ఒకే దేశం.. ఒకే భాష… ఈ మాట అమిత్ షా నోటి వెంట వచ్చిన మరుక్షణం కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు మొదలైంది. ముఖ్యంగా దేశాభిమానం కంటే భాషాభిమానమే ఎక్కువగా వుండే తమిళనాడులో పాలక, ప్రతిపక్షాలనే తేడా లేకుండా అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. బలవంతంగా హిందీని రుద్దితే సహించేది లేదని ఢంకా బజాయించి మరీ సవాల్ చేశారు. నిజానికి అమిత్ షా మాటలను తరచి చూస్తే హిందీని బలవంతంగా రుద్దే ఉద్దేశమేమీ కనిపించలేదు. నిజానికి ఆమాటల కంటే ముందు ఆయన తమిళ భాషను.. దాని చరిత్రను పొగిడారు కూడా.. కానీ స్టాలిన్, కమల్ హాసన్ లాంటి వారికి హిందీ వ్యాఖ్యలు తప్ప ఇంకేమి వినిపించినట్లు లేదు. దాంతో హిందీ వ్యతిరేక పోరాటానికి సైతం సిద్ధమన్న స్థాయిలో వ్యాఖ్యలు చేశారు స్టాలిన్, కమల్. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా ఒకే భాష సాధ్యమా అంటే సాధ్యం కాదనే చెప్పాలి. వేర్వేరు భాషలు, సంస్కృతులు పరిఢవిల్లిన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే అధికారిక భాష అమలు చేయడం అసాధ్యమనే చెప్పాలి.

one nation one language no hindi with pressure, ప్రాంతీయ భాషలే పట్టుగొమ్మలు

 

హిందీ అనుసంధాన భాషగా ఉండాలని, అప్పుడే దేశం సమైక్యంగా ఉండి ప్రపంచంలో ఆ భాషకు గుర్తింపు వస్తుందని హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అంటే భిన్నత్వంలో ఏకత్వం కాకుండా ఏకత్వంతో ఐక్యత గురించి మాట్లాడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమిత్ షా హిందీని బలవంతంగా అమలు చేస్తామని చెప్పలేదు కాని గతానుభవాన్ని బట్టి చూస్తే అలాగే కనిపిస్తోంది. 2019నాటి జాతీయ విద్యా విధానం ముసాయిదా పత్రంలోనూ హిందీని దేశమంతా అమలు చేయడం గురించే మాట్లాడారు. దీనివల్ల ‘ఒకే దేశం, ఒకే భాష‘ అన్న సూత్రాన్ని బిజెపి ప్రభుత్వం అమలు చేయాలనుకుంటోందన్న అభిప్రాయాలు వినిపించడానికి కారణమైంది.

ఇది మన దేశంలో భాషా ప్రాతిపదిక మీదే రాష్ట్రాల పునర్విభజన జరిగిందన్న వాస్తవాన్ని విస్మరించడమే. నిజానికి మన దేశం ‘భిన్న భాషల సమాఖ్య’. ఆ రకంగా తమిళులు కావడానికి భారతీయులు కావడానికి తేడా లేదు. ‘ఒకే దేశం, ఒకే భాష’ అన్న సూత్రం భారత జాతీయతనే మసకబారుస్తోంది. భాషా భేదాలను, ప్రాంతీయ భేదాలను విస్మరిస్తోంది. ఇప్పటి దాకా అనుసరిస్తున్న విధానం ప్రయోజనకరంగా ఉంది. దేశమంతటికీ ఒకే భాషను రుద్దాలన్న ప్రయత్నం ఘర్షణలకు, వైరుధ్యాలకు, చీలికలకు దారి తీస్తుంది.

అసలు భాషే ప్రజాస్వామ్య వ్యవస్థ. అంతర్గతంగా అది బహుళత్వంతో కూడింది. భాషకు ప్రజలు చేసే పనితో, జీవన విధానాలతో సంబంధం ఉంటుంది. ప్రజలు బాగుంటేనే భాష కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే ప్రజలకు జీవనోపాధి మార్గాలు సవ్యంగా ఉంటేనే భాష పరిఢవిల్లుతుంది. 2010లో నిర్వహించిన ప్రజా భాషల సర్వే ప్రకారం మన దేశంలో 780 సజీవ భాషలున్నాయి. కానీ ఆ తరవాత దశాబ్ద కాలంలో 220 భాషలు అంతరించాయి. వలసలు, నిర్వాసితులు కావడంవల్ల ఈ భాషలు అంతరించాయి. భాషల్లో వైవిధ్యాన్ని ఆహ్వానించాలి, మన్నించాలి. అనేక భాషలు అంతరించినందుకు విచారించాలి.

వలసలు ఉన్నప్పుడు భాషా సంబంధమైన ఏ సమస్యనైనా పరిష్కరించడానికి కావాల్సింది భాషల విషయంలో సజాతీయత కాదు. సహజీవనం అవసరం. బహు భాషలు మాట్లాడే నగరాల్లో ఒకే భాషను, ఆధిపత్యం చెలాయించే భాషను రుద్దడంవల్ల, రాజ్య విధానాలు, ప్రభుత్వ విధానాలు దానికి అనుగుణంగా ఉన్నందువల్ల వివిధ భాషా సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. దీనివల్ల నిరసన వ్యక్తం అవుతుంది. ఒకరి భాషకు, ప్రాంతీయ భాషలకు మధ్య సంబంధం ఎందుకు ఉండకూడదు? భాషల అభివృద్ధి సంస్కృతుల మధ్య పరస్పర సహకారంతో సాధ్యం అవుతుందా లేక ఒక భాషను బలవంతంగా రుద్దడంవల్ల సాధ్యం అవుతుందా? భిన్న భాషల మధ్య సహజీవనం, భిన్న సంస్కృతులు, ప్రాపంచిక దృక్పథాల మధ్య సంబంధాలు, సమన్వయం అవసరం.

ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు కనక అది అనుసంధాన భాషగా ఉపకరిస్తుందన్న వాదనలున్నాయి. దక్షిణాది భాషలు మాట్లాడే వారు తమ భాషలు ప్రాచీనమైనవని, సుసంపన్నమైనవని భావిస్తారు. అలాంటప్పుడు హిందీ విశాల భారతావనికి మధ్య అనుసంధానం సాధించగలుగుతుందా? హిందీని రుద్దడం కాకుండా అది స్వతస్సిద్ధంగా ఎదగడానికి కృషి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వ భాష ఎన్నటికీ ప్రజా భాష కాజాలదు. ఒక భాషను రుద్దడం అంటే సోదర భాషలను అంతమొందించడమే. అది ఉర్దూ కావచ్చు లేదా అత్యంత వేగంగా పెంపొందుతున్న భోజ్ పురి లాంటి కొన్ని మాండలికాలూ కావచ్చు. లేదా అంతరిస్తున్న కుమావూని భాషా కావచ్చు. హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఆ భాషను వదిలేసి ఇంగ్లీషు మాట్లాడే వారిలాగా మారాలనుకుంటున్నారు. చాలా మందికి హిందీ మాట్లాడే వాళ్లం అనిపించుకోవడం భారంగా తయారవుతోంది. ఇలాంటి వారిలో ఆత్మ న్యూనతా భావం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

అనేకమంది యువకులు తాము ఎదిగే దశలో ఇలాంటి వ్యధనే అనుభవిస్తున్నారు. తాము జీవితంలో ఎదగాలంటే ఇంగ్లీషు మీద పట్టు సంపాదించాలనుకుంటున్నారు. అందువల్లే హిందీ మాట్లాడే వారికి కూడా ఆ భాష మీద గౌరవం సన్నగిల్లుతోంది. వాళ్లు ఇంట్లో కూడా ఇంగ్లీషు మాట్లాడడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక భాషను ఉద్ధరించడానికి చేసే ప్రయత్నం మరో భాషను రుద్దడానికి దారి తీస్తుందా?

మరో వైపున జీవితానికి ఉపకరించే భాష, నేర్చుకునే భాష మధ్య అంతరాలను రూపుమాపాలన్న ప్రయత్నమూ కనిపిస్తోంది. స్థానిక భాషల్లో తగిన బోధనా సౌలభ్యాలు ఉన్నాయా? స్థానిక భాషల్లో జ్ఞానం అందుబాటులో ఉందా? పండితులు, సాహితీ వేత్తలు స్థానిక భాషల్లో రాయడం వల్ల ప్రయోజనం ఉంటుందనుకుంటున్నారా? సామాజిక, ఆర్థిక అంతరాలను అధిగమించి ప్రజలలో చైతన్యం కలిగించే శక్తి స్థానిక భాషలకు ఉందా అన్నది ఆలోచించదగిన అంశం. కావాల్సింది అనుసంధాన భాషగా ఒక భాషను రుద్దడం కాదు. ప్రజల మధ్య సమన్వయం సాధించే భాషను పెంపొందించాలి. ఒకే భాష కాకుండా బహుళ భాషలే భారతీయతకు గుర్తింపు. అందుకే ప్రాంతీయ భాషలే దేశానికి ఆయువు పట్టు అని గుర్తించాలి.