ప్రస్తుతం ప్రపంచంలో ఏం నడుస్తోంది? అంటే.. చంద్రయాన్ 3 టాపిక్ నడుస్తోందని కరాఖండిగా చెబుతారు ఎవరైనా. అవును, మరి.. భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. ప్రతి భారతీయుడు గర్వంగా మీసం మెలేసే ప్రయోగం ఇది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను సేఫ్‌గా దించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా ఇస్త్రో శాస్త్రవేత్తలు.. చంద్రుడిపై ఉన్న ఖనిజ నిక్షేపాలు, అక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు. రోవర్ ప్రజ్ఞాన్ పంపించనున్న ఫీడ్(ఫోటోస్)ను విశ్లేషించి, చంద్రుడి రహస్యాలను నిగ్గుతేల్చనున్నారు ఇస్త్రో శాస్త్రవేత్తలు.
ప్రజ్ఞాన్ చంద్రుడిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఈ 14 రోజులు వరుసగా చందమామ ఫోటోలను ప్రతి క్షణం ఇస్త్రోకు చేరవేయనుంది. ఈ ఫోటోలు, ఇతర అంశాల ఆధారంగా చందమామపై వాతావరణ పరిస్థితులను, ఖనిజాలను విశ్లేషించనున్నారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. అయితే, ప్రజ్ఞాన్ 14 రోజులు మాత్రమే పరిశోధనలు జరుపడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఆ 14 రోజుల తరువాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి భూమికి చేరుకుంటాయా? లేక మళ్లీ ప్రయోగాన్ని ప్రారంభిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి చంద్రుడిపై ఒక రోజు అంటే.. మనకు 14 రోజులతో సమానం. అంటే చందమామపై 14 రోజులు పగలు, మిగతా 14 రోజులు చీకటిగా ఉంటుంది. ప్రజ్ఞాన్ సూర్య కిరణాల ఆధారంగా పని చేస్తుంది. శాస్త్రవేత్తలు కూడా ఇందుకు అనుగుణంగానే రోవర్‌ను రూపొందించారు. అయితే, చందమామపై మళ్లీ సూర్యోదయం అయిన తరువాత రోవర్ ప్రజ్ఞాన్ మళ్లీ పని చేసే అవకాశం ఉండొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. చంద్రుడిపై ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. దాదాపు మైనస్ 200 పైనే ఉష్ణోగ్రతలు నమోదువుతాయి. విక్రమ్, ప్రజ్ఞాన్‌లు ఎండలో మాత్రమే పని చేస్తాయి. అందుకే 14 రోజుల పగటి సమయం తరువాత అవి క్రియారహితంగా మారుతాయి. ఇక ల్యాండర్, రోవర్ రెండూ 14 రోజుల పాటు పని చేసేలా డిజైన్ చేశారు. అయితే, సూర్యుడు మళ్లీ ఉదయించినప్పుడు విక్రమ్, ప్రజ్ఞాన్ మళ్లీ జీవం పోసుకునే అవకాశాన్ని ఇస్త్రో శాస్త్రవేత్తలు తోసిపుచ్చలేదు. అదే జరిగితే.. భారత్ చంద్రయాన్ 3 మిషన్‌కు మరింత బోనస్ అవుతుంది.
విక్రమ్, ప్రజ్ఞాన్ మళ్లీ భూమిపైకి వచ్చే అవకాశం లేదు. ఇది సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రయాన్ 3 మొత్తం బరువు 3,900 కిలోలు. ప్రొపల్షన్ మాడ్యూల్ బరువు 2,148 కిలోలు. ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌తో సహా 1,752 కిలోల బరువు ఉంటుంది.
ఇస్రో ఇప్పటికే చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ ఫోటోను షేర్ చేసింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జరిగిన ఖచ్చితమైన సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత విక్రమ్ కెమెరా ద్వారా ఫోటో తీసి పంపిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువంలో సాపేక్షంగా చదునైన ప్రాంతంపై ల్యాండ్ అయింది.
మొత్తం 14 రోజులపాటు నిరంతరాయంగా ఫొటోలు పంపనుంది విక్రమ్ ల్యాండర్. దక్షిణ ధృవంలో తిరుగుతూ చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన క్లియర్ పిక్చర్స్‌ను తీయనుంది రోవర్. చందమామపై వాతావరణం ఎలా ఉంది? మంచు నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయ్? అక్కడి వాతావరణం మానవ మనుగడకు అనుకూలమా? కాదా? ఇలా అనేక అంశాలపై అధ్యయనంచేసి ఎప్పటికప్పుడు ఫొటోలు పంపనుంది.
Here is how the Lander Imager Camera captured the moon’s image just prior to touchdown. pic.twitter.com/PseUAxAB6G
— ISRO (@isro) August 24, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..