
నాగపట్టినం: తమిళనాడులో భారీ మాదకద్రవ్యాల పట్టివేత వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. నాగపట్టినం జిల్లాకు చెందిన తమిళగ వెట్రి కళగం (TVK) నాయకుడు ఎన్. భూబాలన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీలంకకు మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీ మొత్తంలో మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భూబాలన్తో పాటు మరో ముగ్గురిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తాజా వార్తా నివేదికలు వెల్లడించాయి.
శ్రీలంకకు డ్రగ్స్ స్మగ్లింగ్..?
అధికారులకు అందిన సమాచారంతో DRI తిరుచ్చి జోనల్ బృందం నాగపట్టినం జిల్లాలో తనిఖీలు ప్రారంభించింది. తొలుత వేలాంకణ్ణి సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించి, అనుమానితులను విచారించారు. వారి నుంచి లభించిన సమాచారం ఆధారంగా టీవీకే జిల్లా కార్యవర్గ సభ్యుడు, న్యాయవాది భూబాలన్ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. భూబాలన్ ఇంట్లో 100 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డిఆర్ఐ అధికారులు. ఈ కేసులో భూబాలన్తో పాటు సుగన్, అతని సోదరుడు పార్థిబన్, సతీష్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీలంకకు డ్రగ్స్ తరలించేందుకు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు ఉపయోగించారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
రూ.100 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ స్వాధీనం
ఈ తనిఖీల్లో సుమారు 135 కిలోల మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం, అంతర్జాతీయ మార్కెట్ విలువ 100 కోట్ల పైనే ఉంటుందని డిఆర్ఐ అధికారులు అంచనా వేస్తున్నారు.
భూబాలన్ను పార్టీ నుంచి తొలగించిన టీవీకే
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో భూబాలన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని బాధ్యతల నుంచి తొలగించినట్లు టీవీకే ప్రకటించింది. పార్టీ ప్రతిష్ఠకు, క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తంగా, నాగపట్టినం డ్రగ్స్ కేసు తమిళనాడులో రాజకీయ చర్చకు దారితీసింది. మాదకద్రవ్యాల మూలం, శ్రీలంకకు తరలింపు వెనుక ఉన్న నెట్వర్క్, ఈ వ్యవహారంలో ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై DRI దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..