బొగ్గు ‘మసి’ ! బెంగాల్ లో టీఎంసీ నేత అభిషేక్ ముఖర్జీ భార్యకు సీబీఐ నోటీసులు, బీజేపీ ‘కసి’!

బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ ముఖర్జీ భార్య రుజిరా నరూలా కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. బొగ్గు స్మగ్లింగ్ కేసుతో..

బొగ్గు 'మసి' ! బెంగాల్ లో టీఎంసీ నేత అభిషేక్ ముఖర్జీ భార్యకు సీబీఐ నోటీసులు, బీజేపీ 'కసి'!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 21, 2021 | 3:38 PM

బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ ముఖర్జీ భార్య రుజిరా నరూలా కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. బొగ్గు స్మగ్లింగ్ కేసుతో ఆమెకు ప్రమేయమున్నట్టు వచ్చిన ఆరోపణలను పురస్కరించుకుని ఈ సమన్లు ఇచ్చినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ముగ్గురు అధికారులతో కూడిన బృందం ఆదివారం ఆమె ఇంటికి వచ్చి నోటీసులను అందజేసిందని, ఇంటిలోనే ఆమెను విచారించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాది నవంబరులో సీబీఐ ఈ కేసు దాఖలు చేసింది. అక్రమ బొగ్గు తవ్వకాలు, ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ కు చెందిన కనుస్టోరియా, కజోరియా బొగ్గు క్షేత్రాల నుంచి బొగ్గు చోరీ తదితర ఆరోపణలు ఈమెపై ఉన్నాయి.  బెంగాల్ లో పాలక తృణమూల్ కాంగ్రెస్ నేతలకు కోల్ మాఫియా రెగ్యులర్ గా ముడుపులు అందజేస్తోందని, పార్టీ యువజన నేత వినయ్ మిశ్రా ద్వారా ఈ చెల్లింపులు జరిగేవని సమాచారం. ఈ కేసుతో లింక్ ఉన్నట్టు భావిస్తున్న వినయ్ మిశ్రా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనికోసం సీబీఐ నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం మమత మేనల్లుడైన అభిషేక్ బెనర్జీని బీజేపీ టార్గెట్ చేసినట్టు భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పాలక తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించి ఎలాగైనా అధికార పగ్గాలను  చేబట్టేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. పైగా హోం మంత్రి అమిత్ షా, అభిషేక్ ముఖర్జీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.

కాగా-శుక్రవారం సీబీఐ బృందం కోల్ కతా, బంకూరాలలో అమీయ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన జయదేబ్ మండల్ ఇంటిపై కూడా దాడులు చేసింది. బొగ్గు స్మగ్లింగ్ రాకెట్ కేసులో సూత్రధారిగా భావిస్తున్న అనూప్ మంఝి అలియాస్ లాలాకు ఈయన డెప్యూటీ అని చెబుతున్నారు. లాలాతో బాటు ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ మేనేజర్లు అమిత్ కుమార్ ధర్, జయేష్ చంద్ర రాయ్, ఇంకా ఈ సంస్థ సెక్యూరిటీ చీఫ్ తన్మయ్ దాస్ తదితరులపై సీబీఐ గత నవంబరులో ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసింది.

Read More:

పుదుచ్చేరి పాలిటిక్స్: మరో ఎమ్మెల్యే ఔట్, రేపే పరీక్ష, అసెంబ్లీలో బలాబలాలేంటి..? నంబర్‌ గేమ్‌లో గెలిచేదెవరు?

పొలిటికల్ హీట్ పెంచుతోన్న గట్టు వామన్‌రావు దంపతుల హత్య, ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్న వివాదాలు