Government Apps: భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. గతంలో ఇంటికొక ఫోన్ మాత్రమే ఉంటే.. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. మనిషి జీవితంలో అదొక నిత్యావసరంగా మారిపోయింది. అదే సమయంలో కొన్ని యాప్‌లు కూడా మనిషికి ఎంతో కీలకంగా మారిపోయాయి. అవి లేకుంటే ఏ పని జరగని పరిస్థితి ఉంది. కొన్ని యాప్‌ల సాయంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తదితరులతో సంభాషించడానికి వీలుంటుంది. మరికొన్ని వినోదంతో కూడిన యాప్స్ ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వ పనులు, వ్యక్తిగత పనులకు సంబంధించిన ముఖ్యమైన యాప్స్ కూడా ఉన్నాయి. ఆ యాప్స్ ఎప్పుడైనా అవసరం పడుతాయనడం సందేహం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బదులు.. కేవలం ఆ యాప్స్ సాయంతో మొబైల్ ఫోన్‌లోనే పనులు పూర్తి చేసుకోవచ్చు. మరి ఆ యాప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉమాంగ్ యాప్..
ఉమాంగ్ ఒక యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్. మీకు పిఎఫ్ ఖాతా ఉంటే, దానికి సంబంధించిన మొత్తం సమాచారం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌ను ఉపయోగించి PF ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. మీరు రిక్వెస్ట్‌లను కూడా ట్రాక్ చేయవచ్చు. ఇది కాకుండా, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, గృహ, వ్యవసాయం, వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
మైగోవ్ యాప్..
ఈ యాప్ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల గురించిన సమాచారాన్ని పొందవచ్చు. మీ అభిప్రాయాన్ని కూడా ఈ యాప్ ద్వారా చెప్పవచ్చు. అన్ని ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఇందులో ఉందుంటి. అలాగే ఆయా శాఖలు, విభాగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
ఆరోగ్య సేతు..
కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ యాప్‌ను ప్రారంభించింది. అప్పటి నుండి ఇది భారత పౌరులకు ముఖ్యంగా మారింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ కోరుతోంది. కరోనా రోగులను ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా జనవరి నుండి దేశంలో కరోనా టీకాపై ప్రచారం జరుగుతోంది. ఇంకా.. మీరు కోవిన్ పోర్టల్‌ను సందర్శించకుండానే టీకా కోసం ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఎంపరివాహన్ యాప్..
ఈ యాప్ ద్వారా రవాణా రంగానికి సంబంధించిన అనేక సమాచారాన్ని మొబైల్‌లో పొందవచ్చు. మీ కారు, బైక్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. కార్ ఓనర్ పేపర్లు కూడా ఇక్కడ చూడవచ్చు.
డిజిలాకర్ యాప్..
భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక చేపట్టిన డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా డిజిలాకర్ యాప్‌ను తీసుకువచ్చింది. డిజిటల్ పాలనలో ఇది ఎంతో కీలకమైనది. దీనిలో మీరు రిజిస్ట్రర్ అయి.. మీకు సంబంధించిన అన్ని పత్రాలను భద్రపరుచుకోవచ్చు. మార్క్‌షీట్లు, సర్టిఫికెట్లు సహా అన్ని ప్రభుత్వ పత్రాలను ఇక్కడ అప్‌లోడ్ చేయవచ్చు. దీని వల్ల ముఖ్యమైన పత్రాలను నిరంతరం వెంట తీసుకెళ్లాల్సిన పని ఉండదు. అవసరమైన చోట ఆ సర్టిపికెట్లను మొబైల్ నుంచే చూపించడం గానీ, ప్రింట్ ఔట్ తీసుకోవడం గానీ చేయవచ్చు.
Also read: