
తమిళనాడులో ఓ కారు మనిషి ప్రాణం తీసింది. కారు కొని 15 రోజులు కాకముందే అదే కారు వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తిరుప్పూర్ జిల్లా అవినాశిలో జరిగిన ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్తగా కొనుగోలు చేసిన టాటా హారియర్ ఈవీ కారు ఢీకొని సెంథిల్ అనే షాప్ యజమాని మరణించారు. ఈ ఘటన ఆగస్టు 14న జరిగింది. కారులోని సమన్ మోడ్ ఫీచర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సెంథిల్ తన కారును ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారు సమన్ మోడ్‌లో ఉందని.. అది రిమోట్ మోడ్‌లో కారును ముందుకు లేదా వెనుకకు కదిలేలా చేస్తుంది. అయితే కారు ఎత్తుపై ఉండడంతో సడెన్‌గా వెనక్కి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సెంథిల్ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ సంఘటనపై టాటా మోటార్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. కారు గురుత్వాకర్షణ శక్తి కారణంగా వాలుపై నుండి వెనక్కి కదిలిందని.. మోటార్ పనిచేయలేదని కంపెనీ తెలిపింది. ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరమని.. సెంథిల్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని తెలిపింది. అలాగే ఈ దుర్ఘటనకు సంబంధించిన అన్ని వాస్తవాలను సేకరిస్తున్నామని.. వాహనాన్ని చెక్ చేస్తామని చెప్పింది.
టాటా హారియర్ ఈవీలో సమన్ మోడ్ ఒక అధునాతన ఫీచర్. ఇది డ్రైవర్ లేకుండానే రిమోట్ కీ ఉపయోగించి కారును ఇరుకైన ప్రదేశాల్లోకి లేదా బయటకు కదిలించడానికి వీలు కల్పిస్తుంది. అయితే ఈవీ సమన్ మోడ్ పనిచేయకపోవడం వల్ల సెంథిల్ మరణించినట్లు ఆయన బంధువులు ఆరోపించారు. ఈ విషయంలో ఇంకా చట్టపరమైన చర్యలు తీసుకోలేదని.. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు.