
తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పరిపాలనలో తనదైన వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి నాలుగు రోజుల్లోనే ప్రజల సంక్షేమం, భద్రత, సామాజిక సంస్కరణల దిశగా ఏడు సంచలన నిర్ణయాలు తీసుకుని రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా తమిళనాడు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు డీఏ రెండు శాతం పెంచుతూ సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. 58 నుంచి 60 శాతానికి పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..
ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో గృహ వినియోగదారులకు ప్రతి రెండు నెలలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై విజయ్ తొలి సంతకం చేశారు. గత డీఎంకే ప్రభుత్వం 100 యూనిట్లు ఇస్తుండగా, విజయ్ దాన్ని రెట్టింపు చేసి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా సుమారు రూ. 1,730 కోట్ల అదనపు భారం పడనుంది.
మత్తు పదార్థాల మహమ్మారిని తరిమికొట్టేందుకు 65 ప్రత్యేక విభాగాలతో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. పాఠశాలలు, కళాశాలల వద్ద డ్రగ్స్ విక్రయాలపై కఠిన నిఘా ఉంచాలని, ముఖ్యమంత్రి కార్యాలయం దీన్ని నేరుగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అదేవిధంగా మహిళల రక్షణ కోసం ‘సింగ పెణ్’ (Singa Penn) అనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దించారు.
మద్యం నియంత్రణపై విజయ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. విద్యా సంస్థలు, దేవాలయాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 టాస్మాక్ (TASMAC) మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం షాపుల్లో ఇది 15 శాతం వరకు ఉండటం గమనార్హం. అంతేకాకుండా మద్యం కొనుగోలు చేసే వారి వయసు ధ్రువీకరణ కోసం ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి చేశారు.
నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ టీఎన్పీఎస్సీ, ఎస్ఎస్‌సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని ప్రకటించారు. గ్రామీణ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీట్ (NEET) పరీక్షను రద్దు చేయాలని, ప్లస్ టూ మార్కుల ఆధారంగానే వైద్య సీట్లు కేటాయించాలని కేంద్రానికి అధికారికంగా విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలోనే.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏం పెంచుతూ విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాల ద్వారా విజయ్ ప్రభుత్వం సంక్షేమం, సామాజిక సంస్కరణల కలయికగా పాలనను సాగిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..