
అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. భార్య మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతోందనే అనుమానంతో ఆమెతో గొడవపడిన భర్త, చివరకు ఆమెను దారుణంగా హతమార్చాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెల్లడైంది. హత్య అనంతరం మృతదేహాన్ని రాజకాలువలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బెంగళూరులోని మాగడి రోడ్డు పరిసరాల్లో వెలుగుచూసింది.
రాజకాలువలో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం
అక్టోబర్ 13న మాగడి రోడ్డు సమీపంలోని రాజకాలువలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం దానిని విక్టోరియా ఆసుపత్రికి తరలించి, మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో పోలీసులకు తొలుత సవాలు ఎదురైంది. అయితే ఆమె ధరించిన దుస్తులు, నగల ఆధారంగా మృతురాలిని రుక్సానా (25)గా గుర్తించారు. ఆమె భర్త ఇర్ఫాజ్ (28) వివరాలను సేకరించిన పోలీసులు కేసును మరింత లోతుగా విచారించారు.
ఫోన్ కాల్స్‌పై అనుమానం.. తరచూ గొడవలు
పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన రుక్సానా, ఇర్ఫాజ్ ఉపాధి కోసం బెంగళూరుకు వలస వచ్చారు. గతంలో రుక్సానాకు వివాహం జరిగినప్పటికీ, మొదటి భర్తకు దూరమైన తర్వాత ఇర్ఫాజ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఏడాది క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. సుమారు ఆరు నెలల క్రితం బెంగళూరుకు చేరుకున్న ఈ దంపతులు ఓ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్నారు. రుక్సానా తరచూ మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతోందని ఇర్ఫాజ్ అనుమానించేవాడని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన రాత్రి కూడా ఇదే అంశంపై గొడవ జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
రాయితో దాడి.. ఆపై గొంతు నులిమి హత్య
పోలీసుల కథనం ప్రకారం.. ఆగ్రహంతో ఉన్న ఇర్ఫాజ్ రుక్సానా తలపై బండరాయితో దాడి చేశాడు. ఆమె తీవ్రంగా గాయపడిన తర్వాత గొంతు నులిమినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి రాజకాలువలో పడేసి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని గుర్తించిన పోలీసులు దర్యాప్తు కొనసాగించి ఇర్ఫాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ యతీశ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అనుమానాల కారణంగా వివాదాలు హింసాత్మకంగా మారడం చివరకు ప్రాణనష్టానికి దారితీసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..