రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్, అతని సహచరుడు అజయ్ కుమార్ కి ఆరు రోజుల పోలీస్ కస్టడికి రిమాండ్ చేస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. వీరిని తమకు 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోరినప్పటికీ కోర్టు అందుకు తిరస్కరించింది. . ఆరు రోజులకు మాత్రం అనుమతించింది. ఢిల్లీ సిట్ పోలీసులు ఈ మధ్యాహ్నం ఈ ఇద్దరినీ ముంద్ కా ప్రాంతం వద్ద అరెస్టు చేశారు. 19 రోజులుగా వీరి కోసం ఖాకీలు గాలించారు. తనకు, సాగర్ రానాకు ఘర్షణ జరిగిన రోజున తాను స్పాట్ లోనే ఉన్నానని సుశీల్ కుమార్ కోర్టులో అంగీకరించాడు. తన వద్ద డబ్బు అయిపోయిందని, అందువల్ల దానికోసం నగరంలో ఒకరి వద్దకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారని అతడు చెప్పాడు. కాగా ఇతనికి కొన్ని చెడు వ్యసనాలు ఉన్నాయని, డబ్బును దుబారాగా ఖర్చు పెట్టేవాడిని వార్తలు వచ్చాయి. సుశీల్ కుమార్, అజయ్ కుమార్ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి, తమ ఆచూకీ తెలియకుండా ఉండేందుకు తమ్ సెల్ ఫోన్లను వాడకుండా వదిలేశారని తెలిసింది.
వీరు హరిద్వార్, రిషికేష్ తదితర ప్రాంతాల్లో తలదాచుకుంటూ వచ్చారని, డబ్బులు అయిపోవడంతో మళ్ళీ ఢిల్లీకి తిరిగి వచ్చారని భావిస్తున్నారు. వీరికోసం హర్యానా పోలీసులు కూడా అనేక చోట్ల గాలించడమే కాకుండా ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. ఒకప్పుడు తన రెజ్లింగ్ ప్రతిభతో ఇండియాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన ఈ ఒలంపిక్ మెడలిస్ట్ చివరకు హత్య కేసులో దోషిగా మారడం విశేషం.