శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి భద్రత కల్పించాలంటూ ఇద్దరు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పోలీస్ బందోబస్తుతో తమను శబరిమలకు సురక్షితంగా పంపేలా కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ వారు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఇది చాలా సున్నితమన అంశమని, దీన్ని మరింత వివాదాస్పదం చేయొద్దని అన్నారు. అంతేకాకుండా దీనిపై ఏడుగురు జడ్జిలతో కూడిన బెంచ్ అంతిమ నిర్ణయం వెలువరించేవరకు తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేమని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక మహిళలకు భద్రత కల్పించాలంటూ కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం కూడా సముచితం కాదని ధర్మాసనం పేర్కొంది. వేలాది సంవత్సరాలుగా అక్కడ ఈ ఆచారం కొనసాగుతుందని.. అందుకే మీకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయలేయమని పిటిషనర్లను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు చేశారు. అయితే శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలంటూ కొన్ని పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సుప్రీం కోర్టు గత నెలలో నిర్ణయించిన విషయం తెలిసిందే.