అడవుల్లో జంతువులు జనావాసాల్లోకి రావడం ఇటీవల సర్వసాధారణంగా మారిపోయింది. పెద్ద పెద్ద పులులు మొదలు చిన్న చిన్న పాముల వరకు ఇంట్లోకి దూరిపోతున్నాయి. అడవుల సాంధ్రత తగ్గుతుండడమో, వాటికి సరిపడ ఆహారం లభించకపోతుండడమో కారణం ఏదైనా మూగ జీవులు మనుషుల మధ్యకు వచ్చి అవి ఇబ్బంది పడడమే కాకుండా, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా పాములతో పెద్ద సమస్యగా మారిపోయింది.
వాతావరణం కాస్త వేడెక్కితే చాలు ఎక్కడెక్కడో ఉన్న పాములు జనాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఆ పాములు చేసే హంగామా కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పాములకు సంబంధించి రోజుకు ఒక్క వీడియో అయినా నెట్టింట వైరల్ కాకుండా ఉండని పరిస్థితులు ఉన్నాయి. షూలో దూరిన పాము, బైక్ సీటు కింద నక్కిన పాము.. ఇలా నిత్యం ఏదో ఒక వార్త చదువుతూనే ఉన్నాము. అయితే తాజాగా కేరళలో జరిగిన ఓ సంఘటన షాక్‌కి గురిచేస్తోంది. ఈ వార్త చదివిన తర్వాత హెల్మెట్‌ను ధరించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించక తప్పదు.
ఇంతకీ ఏమైందంటే.. కేరళలోని పుతూర్‌కు చెందిన పొంటెకాల్ సోజన్ అనే వ్యక్తి బుధవారం తాను పనిచేసే చోటుకు బైక్‌పై వెళ్లాడు. అక్కడే బైక్ పార్క్‌చేసి, హెల్మెట్‌ను బైక్‌కు లాక్ చేసి పనికి వెళ్లాడు. ఇక సాయంత్రం 4 గంటల తర్వాత విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతుండగా బైక్ తీశాడు. హెల్మెట్ ధరిద్దామని లాక్ ఓపెన్ చేసి, హెల్మెట్‌ను చేతిలోకి తీసుకోగా.. ఏదో కదులతున్నట్లు అనిపించింది. దీంతో ఏంటా పరిశీలించగా హెల్మెట్‌లో చిన్న నాగు పాము పిల్లను చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు.
దీంతో వెంటనే హెల్మెట్‌ను దూరంగా పెట్టేసి స్థానికంగా ఉన్న అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అటవీ శాఖకు చెందిన ఓ వలంటీర్ సంఘటన స్థలానికి చేరుకున్నాడు. హెల్మెట్‌లో నుంచి పామును జాగ్రత్తగా బయటతీసి తనతో పాటు తీసుకెళ్లాడు. అనంతరం దగ్గర్లోని అడవిలోకి పామును వదిలేశాడు. ఆ పాము వయసు రెండు నెలలు ఉంటుందని సదరు వలంటీర్ తెలిపాడు. ప్రాణాపాయం తప్పిందని సోజన్ ఊపిరి పీల్చుకున్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…