
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వార్షిక అఖిల భారతీయ ప్రాంత్ ప్రచారక్ బైఠక్ కర్ణాటకలోని బెలగావిలో ఆదివారం ముగిసింది. జూలై 10 నుంచి 12 వరకు మూడు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలో సంఘ్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలేతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 226 మంది కార్యకర్తలు ఈ బైఠక్‌లో పాల్గొన్నారు. సమావేశంలో మార్చి 2026 తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించిన సంఘ్ శిక్షణా శిబిరాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.
ఈ ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 83 సంఘ్ శిక్షా వర్గ్‌లు, 12 కార్యకర్త వికాస్ వర్గ్‌లు నిర్వహించగా, వీటిలో మొత్తం 18,842 మంది స్వయంసేవకులు శిక్షణ పొందినట్లు వెల్లడించారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో దైనందిన శాఖ నిర్వహణ, సంఘ్ కార్యపద్ధతి, గ్రామ వికాసం, కుటుంబ ప్రబోధన్, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు. శాఖ స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్న గరిష్ట శాఖ విస్తార్ యోజనను విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సమాలోచనలు జరిగాయి. అలాగే సంఘ్ శతాబ్ది ఉత్సవాల సంవత్సరంలో ఇప్పటికే పూర్తయిన కార్యక్రమాలను సమీక్షించి, మిగిలిన కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సంఘ్ కార్యకలాపాల ద్వారా పరిచయమైన ప్రజలను సామాజిక సేవా కార్యక్రమాలు, పంచ పరివర్తన్ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసే అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ దేశవ్యాప్త పర్యటనల ప్రణాళికను కూడా సమీక్షించినట్లు వెల్లడించారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా జనాభా గణన సమాచారం, జనాభా అసమతుల్యత వల్ల ఎదురయ్యే సవాళ్లపై చర్చించారు. అలాగే దేశంలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వ్యసన విముక్తి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరాన్ని సమావేశం ప్రస్తావించింది. సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికలపై కూడా చర్చించినట్లు తెలిపారు.
అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరంలోని విరాళాల హుండీ నగదు లెక్కింపులో జరిగిన అవకతవకల ఘటనపై సమావేశంలో విచారం వ్యక్తం చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు కొనసాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), పోలీసుల విచారణ నిర్ణయాత్మక దశకు చేరుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీర్థ క్షేత్ర ట్రస్ట్ తగిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి