Maha Kumbh Mela: మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. షెడ్యూల్ ఖరారు

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహా కుంభమేళాలో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10న ఆమె ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్నానం ఆచరిస్తారని రాష్ట్రపతి భవన్ ఆదివారంనాడు విడుదల చేసిన ఓ ప్రటకలో తెలిపింది. అనంతరం స్నానిక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. షెడ్యూల్ ఖరారు
President Droupadi Murmu

Updated on: Feb 09, 2025 | 10:27 PM

మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఆదివారం (09 ఫిబ్రవరి) వరకు 41 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాలో పాల్గొన్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. కాగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) మహా కుంభమేళాలో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10 (సోమవారం) ఉదయం రాష్ట్రపతి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అనంతరం గంగా పూజ, హారతి నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి భవన్‌ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. అనంతరం స్థానిక బడే హనుమాన్ ఆలయం, పవిత్రమైన అక్షయవత్‌ వృక్షాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే కుంభమేళా ప్రదేశంలో ఏర్పాటు చేసిన ‘డిజిటల్‌ కుంభ్‌ అనుభవ్‌ సెంటర్‌’ను పరిశీలిస్తారని రాష్ట్రపతి భవన్ ఆ ప్రకటనలో తెలిపింది. ప్రయాగ్‌రాజ్‌లో ఐదు గంటల పాటు రాష్ట్రపతి ముర్ము పర్యటన కొనసాగనుంది.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మహా కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు. ద్రౌపదీ ముర్ము పర్యటన సమయంలో ఆమె వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉంటారని  సీఎంవో వెల్లడించింది. గతంలో భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ కూడా కుంభమేళాకు హాజరయ్యారు.

మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభంకావడం తెలిసిందే. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు నిత్యం త్రివేణి సంగమానికి చేరుకుని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. విదేశీ భక్తులు కూడా భారీ సంఖ్యలో కుంభమేళాలో పాల్గొంటున్నారు. మహాశివరాత్రి రోజైన ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా కొనసాగనుంది. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమాన్ని త్రివేణి సంగమంగా పరిగణిస్తుండటం తెలిసిందే. ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ మహా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించడం తెలిసిందే.