ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తన పర్యటన షెడ్యూల్‌లో లేనప్పటికీ ఆయన స్వయంగా ఓ సామాన్యుడి ఇంటికి వెళ్లి వారితో ముచ్చటించారు. వివరాల్లోకి వెళ్తే.. రూ.15 వేల కోట్లకు పైగా ఖర్చుతో అయోధ్యలో చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రధాని మోదీ శనివారంనాడు ప్రారంభించారు. తన పర్యటనలో భాగంగా పీఎం ఉజ్వల పథకం లబ్ధిదారులైన మీరా అనే మహిళ ఇంటికి వెళ్లారు. మీరా, ఆమె భర్త సూరజ్, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ కాసేపు సరదాగా ముచ్చటించారు. మీరా స్వయంగా తమ ఇంట్లో తయారు చేసిన తేనీటిని ప్రధాని తాగారు.
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం పీఎం ఉజ్వల యోజన. ఈ పథకం కింద లబ్ధిదారుల్లో 10 కోట్లవ లబ్ధిదారు మీరా కావడంతో ఆమె నివాసాన్ని ప్రధాని స్వయంగా సందర్శించారు. ప్రధాని మోదీ స్వయంగా తమ ఇంటికి రావడంతో మీరా, ఆమె కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బిపోయరు. సామాన్య వ్యక్తిలా ప్రధాని మోదీ తమ నివాసానికి విచ్చేయడం నమ్మలేకపోతున్నామన్నారు.
పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారుని ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ.. వీడియో
ఈ సందర్భంగా మీరా కుటుంబ జీవనాధారం గురించి ప్రధాని మోదీ ఆరా తీశారు. తాను అయోధ్యలో పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు మీరా తెలిపారు. అయోధ్యలో రామాలయ నిర్మాణంతో పూల వ్యాపారం మెరుగవుతుందని ప్రధాని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వారి కుటుంబం ఏయే సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్నారో ప్రధాని మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఓ సామాన్యురాలి ఇంటికి ప్రదాని మోదీ రాకతో స్థానికులు భారీ సంఖ్యలో వారి నివాసం వద్దకు చేరుకున్నారు.
దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో మోదీ ప్రభుత్వం పీఎం ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి అయ్యే ఖర్చులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది.