
దేశంలో ఎండలు ముదురుతున్నట్లే.. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడిని మరింత పెంచనున్నాయి. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం,బడ్జెట్ చర్చలు, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లు సహా ఇతర బిల్లులపై చర్చలు జరగనున్నాయి. మొదటి విడతలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడం,రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, బడ్జెట్ ఆమోదం జరిగింది. తొలిసారి లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మా.. ప్రధాని ప్రసంగం లేకుండానే ఆమోదం పొందింది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం,మాజీ ఆర్మీ చీఫ్ నారావణే ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తక వివాదం, ప్రతిపక్ష నేతను మాట్లాడనీయకుండా స్పీకర్ అడ్డుకోవడం,లోక్ సభ నుంచి 8 మంది ఎంపీల సస్పెన్షన్, ప్రధాని మోదీ పై విపక్ష మహిళా ఎంపీల దాడి ఆరోపణలు, స్పీకర్ పై విపక్ష ఎంపీల అవిశ్వాస తీర్మానం తో తొలి విడత బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పై చర్చ, ఓటింగ్ జరగనుంది. విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసు ప్రకారం.. కాంగ్రెస్ ఎంపీలు ముహమ్మద్ జావేద్, కె.సురేశ్, మల్లు రవి ముగ్గురు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. స్పీకర్ ఓం బిర్లా పక్షపాత ధోరణి చూపుతున్నారని, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనీ, మహిళా విపక్ష ఎంపీలపై అనుచిత ఆరోపణలు చేశారనీ ప్రజా సమస్యలు లేవనెత్తినందుకు 8 మంది విపక్ష ఎంపీలను పూర్తి సమావేశానికి సస్పెండ్ చేశారనీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే అధికార పార్టీ బీజేపీ,ఎన్‌డీఏ సభ్యులు మాజీ ప్రధాన మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని వివాదాస్పద విషయాల్లో బహిరంగంగా అధికార పార్టీకి మద్దతిచ్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని 118 మంది విపక్ష ఎంపీలు లోక్ సభ సెక్రటరీ జనరల్‌కి ఫిబ్రవరి 10 తేదీన అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. తీర్మానంలో స్పీకర్ ఇకపై సభలో అన్ని పార్టీల నమ్మకాన్ని కోల్పోయారనీ స్పీకర్ పక్షపాత వైఖరి సభ్యుల హక్కులను దెబ్బతీస్తోందనీ సభ సాఫీగా నడవకుండా చేస్తోందనీ ఆరోపించారు..
రాజ్యాంగం ఆర్టికల్ 94 సి ప్రకారం.. తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది సభ్యులు నిలబడి మద్దతు తెలపాలి. దీనికి అనుగుణంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరుగుతుంది. స్పీకర్ చర్చలో పాల్గొని ఓటు వేయవచ్చు కానీ అధ్యక్షత వహించలేరు. ఆయన అధికార పార్టీ సభ్యుల మధ్య కూర్చోవచ్చు. కానీ ఓం బిర్లా ఈ అవిశ్వాస తీర్మాన ప్రక్రియకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన తరువాత నిబంధనల ప్రకారం 14 రోజులకు సమయం పూర్తయినందున అవిశ్వాస తీర్మానం అంశాన్ని పార్లమెంట్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో చేర్చారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మూడు రోజులపాటు పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటలకు పైగా సమయం కేటాయించారు. స్పీకర్ తొలగింపు ప్రక్రియను ఆర్టీకల్ 94సి లో స్పష్టంగా పొందుపరిచారు. దాని ప్రకారం అవిశ్వాస తీర్మానం సాధారణ మెజారిటీతో నెగ్గితే స్పీకర్ ఉద్వాసనకు గురవుతారు. అవిశ్వాస తీర్మానం కోసం నోటీసివ్వడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. రాజ్యాంగ పదవులు, సంస్థలను అగౌరవపరచడంలో కాంగ్రెస్ పాత్రను హైలైట్ చేయాలని బీజేపీ, ఎన్డీఏ ఎంపీలు నిర్ణయించారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించడం,ప్రతిపక్ష నేతను మాట్లాడనియకపోవడం,ఎంపీల సస్పెన్షన్,బిజెపి ఎంపీలకు అనుకూలంగా స్పీకర్ వ్యవహరించిన అంశాలను కాంగ్రెస్,విపక్ష ఎంపీలు లేవనెత్తనున్నారు.
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చకు సభకు ప్యానెల్ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్, డీఎంకే,ఆర్జేడీ,వామపక్షాలు,శివసేన, ఎన్సిపీ, తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వనున్నాయి. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే లోక్ సభ సంఖ్యాబలంలో సభకు హాజరైన వారిలో సగానికి పైగా ఎంపీలు తీర్మానానికి మద్దతు తెలపాలి. అయితే ప్రస్తుతం ఎన్‌డీఏకు బలమైన మెజారిటీ ఉండటంతో తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదు. ఇటీవల కోటా ఎయిర్ పోర్టు శంకుస్థాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పీకర్ ఓం బిర్లాను అత్యంత నిష్పక్షపాతంగా, గౌరవప్రదంగా, సభను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.
స్పీకర్‌పై ఇప్పటికే దాకా మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టినా, రెండుసార్లు ఓటింగ్ దాకా వచ్చినా అవి వీగిపోయాయి. ఓటింగ్‌కు హాజరైన ఎంపీలలో సగానికంటే ఎక్కువ ఓట్లు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉండటం వల్ల తీర్మానం వీగిపోయింది. గతంలో స్పీకర్లు జీవీ మౌలాంకర్ (1954), హుకుంసింగ్ (1966), బలరాం జాఖడ్ (1987)పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాలిచ్చినా అవి వీగిపోయాయి.
లోక్‌సభలో మొత్తం సీట్లు: 543
స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పాస్ కావాలంటే రాజ్యాంగం ఆర్టికల్ 94(c) ప్రకారం సభలో హాజరైన, ఓటు వేసిన సభ్యులలో సాధారణ మెజారిటీ సగానికంటే ఎక్కువ అవసరం. అంటే అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే 273 మంది మద్దతు అవసరం ప్రస్తుతం ఇండియా బ్లాక్ మొత్తం బలం సుమారు 234 సీట్లు విపక్షాలు అన్నీ ఓటు వేసినా NDA మెజారిటీని దాటలేవు దీంతో తీర్మానం వీగిపోయే అవకాశమే ఎక్కువ. అధికార NDA బలం సుమారు 293 సీట్లుగా ఉంది. దీనికి తోడు ఎన్డీఏ లో లేని పార్టీలు వైసీపీ, శిరోమణి అకాలీదళ్, స్వతంత్ర ఎంపీల మద్దతు కలిస్తే అధికార పక్షం బలం 300 పై మార్కుకు చేరుతుంది. NDAకు బలమైన సంఖ్యాబలం ఉండటంతో స్పీకర్ ఓం బిర్లా ఆయన స్థానంలో కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది