Pariksha Pe Charcha 2022: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ వార్షిక ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ (PM Narendra Modi).. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నేరుగా సంభాషించి.. సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో వేయి మంది విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. ప్రధాని మోడీ (Pariksha Pe Charcha) 2018 నుంచి ప్రతి ఏటా విద్యార్థుల వార్షిక పరీక్షలకు ముందు పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఒత్తిడిని జయించి పరీక్షలను ఎలా రాయాలి.. భయాందోళనను దూరం చేసి ఎలా సన్నద్ధమవ్వాలి అనే విషయాలపై ప్రధాని మోదీ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేస్తారు. కాగా.. నాలుగేళ్లుగా విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా.. గతేడాది కరోనా కారణంగా ఈ కార్యక్రమం వర్చువల్ పద్దతిలో జరిగింది.
కాగా.. ఈ కార్యక్రమానికి వస్తోన్న స్పందన అసాధారణమని ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ట్విట్ చేశారు. దీనికోసం ఇప్పటికే లక్షల్లో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారని.. ఇందుకు సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఏప్రిల్ ఒకటిన జరగబోయే కార్యక్రమం కోసం వేచిచూస్తున్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
కాగా.. పరీక్షల నేపథ్యంలో ఒత్తిడి, భయం వంటి సమస్యల్ని అధిగమించేందుకు ప్రధాని నుంచి సలహాలు కోరి చిట్కాలు పొందాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు. ఎగ్జామ్ వారియర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సిద్ధంగా ఉండండి అంటూ ఆయన ట్విట్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ సహా విదేశాల నుంచి కోట్లాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొంటారని తెలిపారు. పరీక్షా పే చర్చ కార్యక్రమం తల్కతోరా స్టేడియం నుంచి టౌన్ హాల్ ఇంటరాక్టివ్ ఫార్మాట్‌లో జరుగుతుందని మంత్రి తెలియజేశారు.
Also Read: