
అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకను పాకిస్థాన్ యుద్ధనౌక ఉద్దేశపూర్వకంగా అత్యంత ప్రమాదకర రీతిలో వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని పాకిస్థాన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసి గట్టి నిరసనను నమోదు చేసింది. సెప్టెంబర్ 15 సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో భారత నౌకాదళ యుద్ధనౌక రొటీన్ సర్వైలెన్స్ నిర్వహిస్తోంది. ఆ సమయంలో పాకిస్థాన్ నావికాదళానికి చెందిన ఒక నౌక అత్యంత వేగంతో భారత నౌక సమీపంలోకి దూసుకువచ్చింది. అంతర్జాతీయ సముద్ర నియమాలను, నావికా నిబంధనలను ఏమాత్రం పాటించకుండా, ప్రమాదకర పద్ధతిలో కదులుతూ భారత యుద్ధనౌకను ఢీకొట్టింది.
ఈ ఘటనలో భారత నౌకకు ఎలాంటి తీవ్రమైన నష్టం వాటిల్లనప్పటికీ పాక్ నౌక ప్రవర్తించిన తీరు ప్రమాదకర పరిణామాలకు దారితీసేలా ఉందని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత విదేశాంగ శాఖ, ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఇన్‌ఛార్జ్ సాద్ వర్రైచ్‌కు సమన్లు జారీ చేసింది. సౌత్ బ్లాక్‌కు పిలిపించి అధికారికంగా తీవ్ర నిరసన పత్రాన్ని అందజేసింది.
సముద్రంలో పాక్ నావికాదళ విభాగాల బాధ్యతారాహిత్యం, ప్రమాదకర ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ గట్టిగా హెచ్చరించింది. భవిష్యత్తులో ఇలాంటి ఉద్రిక్తతలు, ప్రమాదాలు పునరావృతం కాకుండా తమ సైనిక విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పాక్ దౌత్యవేత్తకు తేల్చి చెప్పింది. ఇదే తరహా నిరసనను ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఎదుట నమోదు చేయాల్సిందిగా అక్కడి భారత ఛార్జ్ డి అఫైర్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఈ ఘటన రెండు దేశాల మధ్య కుదిరిన కీలకమైన సైనిక ఒప్పందాన్ని నేరుగా ఉల్లంఘించడమేనని భారత్ స్పష్టం చేసింది. సైనిక విన్యాసాలు, కదలికలకు సంబంధించి 1991 ఏప్రిల్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన ఒప్పందంలోని ఆర్టికల్ 10ను పాక్ నౌక ప్రవర్తన ప్రత్యక్షంగా ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. సముద్ర జలాల్లో ప్రయాణించేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత సైనిక నౌకలపై ఉంటుందని, ద్వైపాక్షిక నిబంధనలను గౌరవించాల్సిన అవసరం ఉందని భారత్ తేల్చిచెప్పింది. అంతర్జాతీయ జలాల్లో పాకిస్థాన్ నౌకాదళం చేసిన ఈ దుస్సాహసం ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో మరింత ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తుంది.