
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజెడి అధినేత నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లోని ఒక ఆసుపత్రిలో చేరారు. పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం(ఆగస్టు 17) ఆసుపత్రికి తరలించారు. 78 ఏళ్ల నవీన్ పట్నాయక్ చాలా కాలంగా వయసు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన ముంబైలోని ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే మరోసారి ఆయన ఆరోగ్యం క్షిణించడంతో భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు.
78 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రి శనివారం రాత్రి అసౌకర్యానికి గురయ్యారని, ఆ తర్వాత వైద్యులు ఆయన నివాసం నవీన్ నివాస్‌కు వెళ్లారు. పట్నాయక్ ఆరోగ్యంపై ఆసుపత్రి త్వరలో బులెటిన్ విడుదల చేస్తుందని బిజెడి సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. పట్నాయక్ ఇటీవల ముంబై ఆసుపత్రిలో ఆర్థరైటిస్‌కు వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన జూన్ 20న ముంబైకి బయలుదేరారు. జూన్ 22న శస్త్రచికిత్స చేయించుకున్నారు. జూలై 7న డిశ్చార్జ్ అయ్యారు. జూలై 12న ఒడిశాకు తిరిగి వచ్చారు.
నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజెడి ఒడిశాలో చాలా కాలం అధికారంలో ఉంది. పట్నాయక్ వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మార్చి 2000లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత, జూన్ 12, 2024 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. నవీన్ పట్నాయక్ బిజు పట్నాయక్ కుమారుడు. బిజు పట్నాయక్ కాంగ్రెస్ నుండి విడిపోయి బిజు జనతాదళ్‌ను స్థాపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..