అది తిరువళ్లూరు జిల్లా కవరపెట్టైలో ఉన్న నీట్ పరీక్షా కేంద్రం.. నీట్ ఎగ్జామ్ కోసం చక్కగా ప్రీపేర్ అయిన మోనిక టన్నుల కొద్దీ కాన్ఫిడెన్స్‌తో తల్లి షీలాతో కలిసి ఎగ్జామినేషన్ సెంటర్‌కు వచ్చింది.. అంతా బాగానే ఉంది కానీ తన ఒరిజినల్ ఐడీ కార్డును వెంటపెట్టుకోవడం మర్చిపోయింది.. ఒరిజనల్ ఐడీ కార్డు ఉంటే తప్ప పరీక్ష కేంద్రంలోకి అనుమతించమన్నారు అధికారులు.. అయ్యా ఐడీ కార్డు లేకపోతే ఏమిటి..? హాల్‌టికెట్‌లోని ఫోటోను.. తనను పరికించి చూసి లోపలికి పంపండంటూ బతిమాలింది.. వేడుకుంది.. అధికారులు మాత్రం రూల్స్ రూల్సేనన్నారు.. అనుమతించడం కుదరదని గట్టిగా చెప్పారు.. కన్నీళ్లు పెట్టుకుంది మోనిక.. ఆమె కన్నీళ్లు చూసి కూడా అధికారులు కరగలేదు.. అక్కడే ఉన్న తిరువళ్లూరు జిల్లా డీఎస్పీ రమేశ్ మాత్రం చలించిపోయారు.. విద్యార్థినీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికక్కడే ఓ నిర్ణయం తీసుకున్నారు.. వెంటనే చెన్నైకు వెళ్లి విద్యార్థినికి సంబంధించిన ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకురమ్మంటూ కానిస్టేబుల్ మహేశ్వరన్‌ను ఆదేశించారు.. ఎంతకాదనుకున్నా తిరువళ్లూరు నుంచి చెన్నైకు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది.. అంటే రానూపోనూ 80 కిలోమీటర్లన్నమాట… మహేశ్వరన్ విద్యార్థిని తల్లి షీలాను వెనకాతల కూర్చొబెట్టుకుని చెన్నైకు వెళ్లి ఐడీ ప్రూఫ్ పట్టుకొచ్చారు. అదీ సమయానికి! పోలీసులు చేసిన సహాయానికి మోనిక చెమ్మగిల్లిన కళ్లతోనే కృతజ్ఞతలు చెప్పుకుంది.. దండం పెట్టి సంతోషంతో ఎగ్జామ్ సెంటర్‌లోకి వెళ్లింది.. అక్కడున్న అందరూ పోలీసులను శభాష్ అంటూ ప్రశంసించారు.. ఎగ్జామ్ అయిన తర్వాత మోనికను, ఆమె తల్లి షీలాను చెన్నైకు భద్రంగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. తమ కుటుంబం పోలీసుకు ఎప్పుటికీ రుణపడి ఉంటుందని మోనిక అదుపు చేసుకోలేని భావోద్వేగంతో చెప్పింది..