MasoodAzhar Missing: కరడు గట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్, ఆయన కుటుంబం జాడ తెలియడంలేదని (మిస్సింగ్) పాకిస్థాన్ ప్రకటించింది. కొన్ని రోజులుగా వీరు ఎక్కడికి వెళ్లారో తెలియడంలేదని అమాయకంగా చెబుతోంది. మనీ లాండరింగ్, టెర్రరిస్టుల నుంచి ఉగ్రవాద సంస్థలకు నిధుల పంపిణీని అడ్డుకునేందుకు ఉద్దేశించిన ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ ప్లీనరీ మీటింగ్ ఆదివారం నుంచి ప్రారంభమవవుతున్న వేళ.. పాక్ ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించి ఈ సంస్థను ఇరకాటంలో పెట్టింది. అసలు మసూద్ మరణించాడని ఒకవైపు ఫేక్ వార్తలు వస్తుండగా.. మరోవైపు అతగాడు పాకిస్థాన్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని కూడా పరస్పర విరుధ్దమైన కథనాలు వస్తున్నాయి. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాక్ ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గత ఏడాది జూన్ లో గ్రే లిస్టులో పెట్టింది. తమ దేశంలో ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేయడానికి తీసుకున్న చర్యలను 2019 అక్టోబరు కల్లా వివరించాలని, లేని పక్షంలో మీ దేశాన్ని ఇరాన్, నార్త్ కొరియాతోబాటు బ్లాక్ లిస్టులో పెడతామని ఈ సంస్థ హెచ్చరించింది. అయితే పాక్ ఏ మాత్రం స్పందించలేదు. గత ఏడాది ఫిబ్రవరి 14 న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా దాడి ఘటనకు తమదే బాధ్యత అని మసూద్ అజహర్ ఆధ్వర్యంలోని జైషే మహ్మద్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే.. ఆ దాడిలో సుమారు 40 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అజహర్ ను ఐక్యరాజ్యసమితి, అమెరికా.. గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాయి కూడా.. కాగా పాకిస్తాన్ ను సమర్థిస్తున్న దేశాల్లో చైనాతో బాటు టర్కీ కూడా చేరింది. ఇటీవల పాక్ పార్లమెంటులో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్.. కాశ్మీర్ అంశంపై పాక్ వైఖరిని సమర్థిస్తూ ప్రసంగించారు. భారత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇది తమ అంతర్గత సమస్య అన్న భారత ప్రకటనను పట్టించుకోకుండా ఆయన చేసిన ప్రసంగాన్ని యుఎస్ కూడా తప్పు పట్టింది.