చీకట్లో రసగుల్లా అంటూ నాటుబాంబు ఇస్తే.. తెలియక నోట్లో వేసుకుని కొరికేశాడు! ఆ తర్వాత..

రసగుల్లా అంటూ బంధువు చేతిలో పెట్టిన నాటుబాంబును నిజమైన స్వీట్ అనుకుని నోట్లో పెట్టుకొని కొరకడంతో 35 ఏళ్ల రాజేంద్ర బరోటియా ప్రాణాలు కోల్పోయాడు. గత మంగళవారం రాత్రి పడరియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి రాజేంద్ర తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. జంతువులను చంపేందుకు ఉపయోగించే నాటుబాంబును రసగుల్లా అని చెప్పి ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి బంధువు రామ్‌భగత్ బరోటియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు..

చీకట్లో రసగుల్లా అంటూ నాటుబాంబు ఇస్తే.. తెలియక నోట్లో వేసుకుని కొరికేశాడు! ఆ తర్వాత..
Man Killed After Biting Explosive Mistaken For Rasgulla

Updated on: Nov 13, 2026 | 7:52 AM

మధ్యప్రదేశ్, నవంబర్ 13: సరదాగా మాట్లాడుకుంటూ బంధువు చేసిన పనికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రసగుల్లా అంటూ చేతిలో పెట్టిన నాటుబాంబును నిజమైన స్వీట్ అనుకుని నోట్లో పెట్టుకొని కొరకడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌లోని డిండౌరీ జిల్లా పడరియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రసగుల్లా అంటూ నాటుబాంబు చేతికి ఇచ్చి..

వివరాల్లోకి వెళ్తే.. పడరియా గ్రామానికి చెందిన రాజేంద్ర బరోటియా (35) గత మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో అతని బంధువైన రామ్‌భగత్ బరోటియా అక్కడికి వచ్చాడు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో రామ్‌భగత్ ఓ నాటుబాంబును రాజేంద్ర చేతిలో పెట్టి రసగుల్లా అని చెప్పినట్లు సమాచారం. చీకట్లో అది ఏమిటో సరిగ్గా గుర్తించలేకపోయిన రాజేంద్ర.. నిజంగానే స్వీట్ అనుకుని నోట్లో పెట్టుకొని కొరికాడు. అంతే.. ఒక్కసారిగా భారీ శబ్దంతో నాటుబాంబు పేలిపోయింది. దీంతో అతని నోటికి తీవ్ర గాయాలై రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.

ఇవి కూడా చదవండి

పేలుడు శబ్దం విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన రాజేంద్రను ఆటోరిక్షాలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై రాజేంద్ర భార్య సుశీలాబాయి మాట్లాడుతూ.. జంతువులను చంపేందుకు ఉపయోగించే నాటుబాంబును తన భర్త చేతిలో పెట్టారని, దానిని రసగుల్లా అనుకుని నోట్లో పెట్టుకోవడంతో ప్రమాదం జరిగిందని తెలిపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్వాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాటుబాంబును ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్‌భగత్ బరోటియాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి దుర్గాప్రసాద్ నాగ్‌పురె వెల్లడించారు. ఈ ఘటన వెనుక వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? కావాలనే నాటుబాంబును రసగుల్లా అని చెప్పి ఇచ్చాడా? అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సరదాగా జరిగినట్లుగా కనిపిస్తున్న ఈ ఘటన వెనుక అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us