
భారతీయులకు ఇప్పటివరకు ఫ్రీ ఎంట్రీ, ఇకపై అలా కుదరదంటోంది మలేషియా. అన్ని దేశాల్లాగే వీసాలు తీసుకుని రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఫ్రీ ఎంట్రీలకు ఈ ఇయర్ ఎండింగ్‌ను కటాఫ్ డేటాగా నిర్ణయించింది. డిసెంబర్ 31తో వీసా-ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు మలేషియా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. 2027 జనవరి 1 నుంచి మలేషియాలోకి ప్రవేశించే భారతీయులు తప్పనిసరిగా ముందుగానే వీసా పొందాల్సి ఉందని చెప్పింది. ఇందుకోసం డిసెంబర్ 1 నుంచి అధికారిక మైవీసా పోర్టల్ నుంచి వీసా దరఖాస్తులు సమర్పించే అవకాశాన్ని కల్పించారు. జనవరి 1, 2027 తర్వాత ప్రయాణించేవారు బయలుదేరడానికి ముందే వీసా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నిర్ణయం వెనుక గట్టి కారణమే ఉంది. కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ 2నెలల క్రితం ఓ అడ్వైజరీ జారీ చేసింది.
30 రోజుల వీసా-ఫ్రీ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నించవద్దని సెప్టెంబర్‌లోనే హైకమిషన్ హెచ్చరించింది. కానీ నకిలీ ఉద్యోగ హామీలతో ఏజెంట్ల బారిన పడి కొందరు భారతీయులు అక్రమంగా నివసించడం, ఓవర్‌స్టే, దోపిడీ, నిర్బంధం, చట్టపరమైన చిక్కుల్లో పడుతున్నారని హైకమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. టూరిజం, సామాజిక సందర్శనలకే పరిమితమైన వీసా-ఫ్రీ సదుపాయాన్ని జాబ్స్ కోసం వాడుకోవడం ఇమిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పింది.
వర్క్ పర్మిట్, రిఫరెన్స్‌తో కూడిన వీసా లేకుండా జాబ్స్ కోసం మలేషియాకు వెళ్లవద్దని భారత హై కమిషన్ మరోసారి హెచ్చరించింది. ఇకపై టూర్ ప్లాన్ చేసుకునే భారతీయులు మై వీసా పోర్టల్ నుంచి ముందుగానే వీసా తీసుకుని ప్రయాణాలకు సిద్ధం కావాలని సూచించారు.