కిడ్నాప్ కేసు.. ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి తప్పించుకున్న జీవిత ఖైదీ! 8 ఏళ్ల తర్వాత గుట్టురట్టు

బ్యాంకు లోన్‌, ఉద్యోగాలు వంటి వాటికి ఫోర్జరీ వాడుతారని దాదాపు ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ ఓ మహానుభావుడు ఏకంగా ఫోర్జరీ పత్రాలను చూపి.. సుప్రీంకోర్టు తనకు జైలు శిక్ష నుంచి ఉపశమనం కల్పించిందని జీవిత ఖైదు తప్పించుకుని జైలు నుంచి బయటపడ్డాడు. ఇది జరిగిన ఎనిమిదేళ్లకు జైలు అధికారులకు అసలు నిజం తెలిసి నాలుక కరచుకున్నారు..

కిడ్నాప్ కేసు.. ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి తప్పించుకున్న జీవిత ఖైదీ! 8 ఏళ్ల తర్వాత గుట్టురట్టు
Life Convict Walked Out Of Bengaluru Jail Using Fake Court Order

Updated on: May 25, 2026 | 10:37 AM

కర్ణాటక, మే 24: కర్ణాటకలోని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ నకిలీ సుప్రీంకోర్టు పత్రాలను చూపి జైలు నుంచి బయటకు వచ్చాడు. అలా 8 ఏళ్లు స్వేచ్ఛగా బయట జీవిస్తున్నాడు. దీనిపై ఫిర్యాదులు రావటంతో 8 ఏళ్ల తర్వాత జైలు అధికారులు రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.

2001లో డబ్బు కోసం కిడ్నాప్ చేసిన కేసులో శంకర్ ఆరుముగం అనే వ్యక్తి దోషిగా తేలాడు. సుప్రీంకోర్టు ఉపశమనం మంజూరు చేసినట్లు కొన్ని పత్రాలను సమర్పించి 2018 నవంబర్ 13న జైలు నుంచి బయటకు వచ్చాడు. సదరు నకిలీ కోర్టు ఉత్తర్వుత ప్రకారం రూ. 10,000 జరిమానాను చెల్లించిన తర్వాత అతడిని జైలు అధికారులు విడుదల చేశారు. ఇది జరిగిన 8 ఏళ్ల తర్వాత నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా దోషి విడుదలైనట్లు జైళ్ల డైరెక్టర్ జనరల్‌కు అనామక ఫిర్యాదు అందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన జైలు అధికారులు అంతర్గత విచారణను ప్రారంభించారు. న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌తో ధృవీకరణ సందర్భంగా.. సదరు దోషి సమర్పించిన ఉత్తర్వులు నకిలీవని అధికారులు కనుగొన్నారు.

బెంగళూరులోని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్-1 కిడ్నాప్ కేసులో నిందితుడు శంకర్‌కు ఐపీసీ సెక్షన్ 364A కింద, నేరపూరిత కుట్రకు పాల్పడినందుకు సెక్షన్ 120B కింద దోషిగా నిర్ధారించడంతో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని కోర్టు ఆదేశించింది. అయితే నకిలీ కోర్టు ఉత్తర్వులను ఆమోదించిన అధికారులు జైలు విధివిధానాల గురించి తెలియకుండా ఎలా ఆమోదించారనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జైలు అధికారులు లేదా సిస్టమ్‌లోని ఇతరులు ఎవరైనా దోషి విడుదలకు సహకరించారా? అనే విషయాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత తాజాగా ఈ వ్యవహారం బయటకు రావడంతో పారాపన అగ్రహార పోలీసులు నకిలీ పత్రాల తయారీ, కల్పన, వాటి వినియోగం, మోసానికి సంబంధించి ఐపీసీ సెక్షన్లు 465, 466, 468, 471, 472, 420 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

దోషి శంకర్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నకిలీ పత్రాలను తయారు చేయడంలో, అక్రమ విడుదలకు సహాయపడటంలో పాలుపంచుకున్న వారందరి పాత్రను కూడా పరిశీలిస్తున్నామని జైళ్ల డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఆఫీస్‌కు పంపిన లేఖ ఆధారంగా దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మోసం కర్ణాటక జైళ్ల శాఖలో విధానపరమైన లోపాల్ని, అంతర్గత కుమ్మక్కులను బయటపెట్టినట్లైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us