అతనితో రిలేషన్‌షిప్.. పక్కా ప్లాన్‌తో పాకిస్తాన్‌కు సీక్రెట్స్‌.. జ్యోతి మల్హోత్రా గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే

కొందరిని చూస్తే ఏం బతుకురా అనిపిస్తుంది.. మరికొందరిని చూస్తే.. ఏం బతుకురా నీది.. అనాలనిపిస్తుంది. మనదేశంలో పుట్టి.. దాయాది దేశానికి మన సీక్రెట్స్‌ను అందిస్తున్న ఓ లేడీ యూట్యూబర్‌ను చూసి యావత్ భారతం ఛీకొడుతోంది. ఒకప్పుడు ఆమె మాటలకు, ఆమె వీడియోలకు ఫిదా అయిన యువత.. ఇప్పుడు బాయ్‌కాట్ అంటూ ఆమె యూట్యూబ్‌ ఛానల్‌ను బహిష్కరిస్తున్నారు.

అతనితో రిలేషన్‌షిప్.. పక్కా ప్లాన్‌తో పాకిస్తాన్‌కు సీక్రెట్స్‌.. జ్యోతి మల్హోత్రా గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే
Jyoti Malhotra Danish

Updated on: May 18, 2025 | 5:25 PM

హర్యానాలో పుట్టి పెరిగిన జ్యోతి మల్హోత్రా, సామాన్య కుటుంబంలో పుట్టింది. 2018లో ‘ట్రావెల్ విత్ జో’ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి, ఆహారం, ప్రయాణ అనుభవాలను అద్భుతంగా తన ఫాలోవర్స్‌కు అందించింది. ఆమె మాటలతో మనసు కట్టివేసే గుణం, సరళమైన వీడియోలు లక్షలాది ప్రేక్షకులను ఆకర్షించాయి. అయితే, ఎప్పుడైతే 2023లో పాకిస్తాన్‌లో అడుగుపెట్టిందో..అప్పట్నుంచి ఆమె బుద్ది గతి తప్పింది. అక్కడ ఐఎస్‌ఐ ఏజెంట్ ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో పరిచయం పెంచుకుంది. అది కాస్తా శారీరక సంబంధం దాకా వెళ్లింది. వాడి మాయమాటల్లో పడి దేశద్రోహానికి ఒడిగట్టింది. వాట్సప్‌, ఎన్‌క్రిప్ట్‌డ్‌ మెస్సేజ్‌ల ద్వారా ద్వారా భారత సైనిక స్థావరాల సమీప రహదారులు, ఆయుధ నిల్వల వివరాలను డానిష్‌కు పంపిందీ దేశద్రోహి.

ప్రస్తుతం 5 రోజుల పోలీసు కస్టడీలో ఉంది జ్యోతి మల్హోత్రా. ఆమెకు చెందిన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్టు ఉంది. ఈవెంట్‌లోనే పాకిస్థాన్ జాతీయ దినోత్సవం గురించి జ్యోతి మల్హోత్రా, డానిష్ మాట్లాడుకుంటున్నట్టు ఉంది. గతంలో పహల్గామ్‌లో కూడా జ్యోతి మల్హోత్రా పర్యటించింది.. అయితే.. పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక జ్యోతి మల్హోత్రా పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. యూట్యూబర్ ముసుగులో దేశ రహస్యాలను జ్యోతి ఎలా చేరవేసింది..? ఈ నెట్ వర్క్‌లో ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై పోలీసులు.. మొత్తం ఆరాతీస్తున్నారు.

రహస్యాలను శత్రువులకు అందించిన తీరు చూస్తే షాకవ్వాల్సిందే..

జ్యోతి తన యూట్యూబ్ వీడియోలను గూఢచర్యకు ఉపయోగించిన తీరు చూస్తే షాక్‌ తినాల్సిందే. అంత పగడ్బందీగా మనదేశ రహస్యాలను శత్రువులకు అందించింది. సైనిక స్థావరాల దగ్గరి ప్రాంతాలను షూట్ చేసింది. లోకల్‌ వ్యక్తులకు ఆర్ధికంగా లోబరుచుకుని.. ఫోటోలు, వీడియోలు సేకరించింది. ఈ వివరాలను కోడ్‌ భాషలో ఐఎస్ఐకి చేరవేసేది. ఆమె వీడియోలలోని కొన్ని వివరాలు, స్థలాల పేర్లు సైనిక స్థానాలను తెలియజేసేవిగా ఉన్నాయని దర్యాప్తులో తేలింది. 2024 చివరలో హర్యానా-పంజాబ్ సరిహద్దు వెంబడి సైనిక కదలికల గురించి సమాచారాన్ని జ్యోతి ఐఎస్‌కు పంపింది.

ఇక్కడే జ్యోతి కదలికలపై మన నిఘా ఏజెన్సీలకు డౌటు వచ్చింది. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆమె ఫోన్ సంభాషణలు, ఎన్‌క్రిప్ట్‌డ్ సందేశాలను పసిగట్టాయి. జ్యోతి వీడియోలలో సైనిక స్థావరాల దగ్గర రికార్డైన దృశ్యాలు ఉద్దేశపూర్వకమైనవేనని నిర్థారించారు. ఈ స్పై నెట్‌వర్క్‌లో సంబంధమున్న మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి ఫోన్, ల్యాప్‌టాప్‌లలో ఐఎస్ఐ ఏజెంట్లతో సంభాషణలు, సైనిక స్థావరాల చిత్రాలు లభ్యమయ్యాయి. ఈ ఆధారాలతో ఆమెపై అధికార రహస్యాల చట్టం, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..