సరిహద్దులో PIA గుర్తులతో అనుమానాస్పద బెలూన్! మరోవైపు భారీగా హెరాయిన్ పట్టివేత!

జమ్మూలో పాకిస్థాన్ విమానయాన సంస్థ PIA గుర్తులున్న బెలూన్ కలకలం సృష్టించగా, మరోవైపు భారీ హెరాయిన్ పట్టివేత ఆందోళన రేపింది. పాలన్‌వాలాలో కనిపించిన ఈ బెలూన్ మూలాలపై దర్యాప్తు జరుగుతోంది. డిగియానాలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రూ. 1.925 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేసింది. పంజాబ్‌తో డ్రగ్స్ సంబంధాలపై విచారణ కొనసాగుతోంది. రెండు ఘటనల మధ్య సంబంధం ఇంకా స్పష్టం కాలేదు.

సరిహద్దులో PIA గుర్తులతో అనుమానాస్పద బెలూన్! మరోవైపు భారీగా హెరాయిన్ పట్టివేత!
Jammu Pia Balloon

Updated on: Oct 17, 2026 | 8:09 PM

జమ్మూ: జమ్మూలోని పాలన్‌వాలా ప్రాంతంలో పాకిస్థాన్ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) గుర్తులు ఉన్న అనుమానాస్పద బెలూన్ లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. శనివారం (అక్టోబర్ 17) ఖౌర్ ప్రాంత పరిధిలోని పాలన్‌వాలాలో ఈ బెలూన్ కనిపించినట్లు భద్రతా దళాలు తెలిపాయి. బెలూన్‌పై PIA అని రాసి ఉండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా అక్కడికి చేరింది? దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అనే విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు.

గతంలోనూ ఇలాంటి బెలూన్ లభ్యం!

గతంలోనూ పంజాబ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. గత మే నెలలో హోషియార్‌పూర్‌లోని ఒక పొలంలో PIA గుర్తులు ఉన్న చిన్న విమానం ఆకారపు బెలూన్ లభ్యమైంది. తాజాగా జమ్మూలో మరోసారి ఇలాంటి బెలూన్ కనిపించడంతో ఈ ఘటనపై ఆసక్తి నెలకొంది. అయితే, బెలూన్ కనిపించినంత మాత్రాన దాని వెనుక అనుమానాస్పద చర్యలు ఉన్నాయని నిర్ధారించలేమని పోలీసులు తెలిపారు. దాని మూలం, పరిస్థితులపై విచారణ జరుపుతున్నామన్నారు.

జమ్మూలో రూ.1.925 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

ఇదిలా ఉండగా, జమ్మూలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) చర్యలు చేపట్టింది. డిగియానా ప్రాంతంలో హెరాయిన్ సరఫరా జరుగుతోందన్న సమాచారంతో నిఘా పెట్టిన అధికారులు ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. అతను జమ్మూలోని మీరాన్ సాహిబ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం.

సోదాల సమయంలో నాలుగు ప్యాకెట్లలో ఉన్న మొత్తం 385 గ్రాముల అనుమానిత హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1.925 కోట్లు ఉంటుందని అంచనా. మాదకద్రవ్యాలను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలపై అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌సీబీ వెల్లడించింది.

పంజాబ్‌తో సంబంధాలపై దర్యాప్తు

ప్రాథమిక విచారణలో జమ్మూలోని మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థకు పంజాబ్‌లోని కొన్ని మూలాలతో సంబంధాలు ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో మరెవరైనా ఉన్నారా? మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఒకవైపు PIA గుర్తులున్న బెలూన్‌తో జమ్మూలో కలకలం.. మరోవైపు కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేతతో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ రెండు ఘటనలకు పరస్పర సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us