Indigo Flight: దేశంలో ఎక్కడ చూసినా జోరు వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వర్షాలతో పట్టణాలు, పల్లెలు తడిసి ముద్దవుతున్నాయి. వరద నీటి ఉధృతి కారణంగా పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే, చాలా చోట్ల రహదారులు కొట్టుకుపోయి వాహనాలు స్తంభించిపోయాయి. మరికొన్ని చోట్ల రైలుపట్టాలు వరద నీటిలో కొట్టుకుపోవటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కానీ, గాల్లో ఎగిరే విమానం బురదలో ఇరుక్కుపోవడం ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా..? అదేంటని ఆశ్చర్యపోతున్నారు కదా..? కానీ, అసోం రాష్ట్రంలో జరిగింది ఈ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళితే..
అసోంలోని జొర్హాట్ లో ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. జొర్హాట్ విమానాశ్రయం నుంచి కోల్‌కతా వెళ్లేందుకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే నుంచి జారిపోయింది. రన్ వే పక్కనున్న బురదలో విమానానికి చెందిన ఒక చక్రం ఇరుక్కుపోయింది. ముందుకు కదలకపోవడంగో విమాన సిబ్బంది అప్రమత్తమై.. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
చక్రం బురదలో ఇరుక్కుపోయిన ఫొటోను ఒక జర్నలిస్టు ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో, ఈ విమాన సర్వీసును ఇండిగో ఆపివేసింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 98 మంది పాసింజర్లు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి