భారత్ మాస్టర్ ప్లాన్.. చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టేందుకు రఫేల్ జెట్లతో భారీ వ్యూహం..

చైనా, పాకిస్థాన్‌ల నుంచి పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భారీ రక్షణ వ్యూహానికి శ్రీకారం చుట్టింది. రూ.3.25 లక్షల కోట్ల విలువైన మెగా ఒప్పందం ద్వారా 114 కొత్త రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ ప్రతిపాదన సమర్పించింది. ఇప్పటికే ఉన్న రఫేల్ జెట్లు, నావికాదళం కోసం రానున్న రఫేల్-ఎం విమానాలతో కలిపి భవిష్యత్తులో భారత త్రివిధ దళాల వద్ద 200కుపైగా రఫేల్ యుద్ధ విమానాలు ఉండే అవకాశముంది.

భారత్ మాస్టర్ ప్లాన్.. చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టేందుకు రఫేల్ జెట్లతో భారీ వ్యూహం..
Rafale Fighter Jets

Edited By:

Updated on: Aug 07, 2026 | 1:38 PM

భారత వాయుసేనను తిరుగులేని శక్తిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. శత్రు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ల సంయుక్త సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ ఏకంగా 200కి పైగా ‘రఫేల్’ (Rafale) యుద్ధ విమానాలను మోహరించే భారీ ప్రణాళికకు సిద్ధమైంది. రూ. 3.25 లక్ష కోట్ల విలువైన ఈ మెగా డీల్‌కు సంబంధించి ఫ్రాన్స్‌కు చెందిన ‘డసాల్ట్ ఏవియేషన్’ (Dassault Aviation) పూర్తి టెక్నికల్, కమర్షియల్ ప్రపోజల్‌ను భారత్‌కు సమర్పించింది. భవిష్యత్తు యుద్ధ రంగంలో ఆధిపత్యం చెలాయించేందుకు భారత్ తన ‘ఎయిర్ పవర్’ను అసాధారణ స్థాయిలో పెంచుకుంటోంది. ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ అనుభవాల నేపథ్యంలో.. కేవలం నాణ్యత మాత్రమే కాకుండా సంఖ్యాబలం (Quantity with Quality) కూడా యుద్ధంలో ఎంత కీలకమో స్పష్టమయింది. ఇదే కోణంలో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియ వేగవంతమైంది.

రఫేల్ లెక్కలు ఎలా మారనున్నాయి?

ప్రస్తుత బలం: భారత వాయుసేన వద్ద ఇప్పటికే 36 రఫేల్ జెట్లు ఉండగా.. నావికాదళం (Navy) కోసం మరో 26 ‘రఫేల్-ఎం’ (Rafale-M) ఆర్డర్లో ఉన్నాయి. వీటితో కలిపి మొత్తం సంఖ్య 62కి చేరుతుంది.

114 కొత్త జెట్లు: తాజాగా ప్రతిపాదించిన 114 కొత్త రఫేల్ జెట్ల డీల్ కార్యరూపం దాలిస్తే, ఈ సంఖ్య 176కి పెరుగుతుంది.

మరో 31 నావికాదళ జెట్లు: భవిష్యత్తులో నావికాదళం కోసం మరో 31 రఫేల్-ఎం జెట్లను చేర్చుకునే ప్రణాళిక కూడా ఉంది. ఇవన్నీ పూర్తయితే భారత త్రివిధ దళాల వద్ద 200కి పైగా రఫేల్ యుద్ధ విమానాలు ఉండనున్నాయి.

మేక్ ఇన్ ఇండియా: ఈ 114 కొత్త రఫేళ్లలో ఏకంగా 94 జెట్లను భారతీయ రక్షణ పరిశ్రమ భాగస్వామ్యంతో దేశీయంగానే తయారు చేయనున్నారు.

పాకిస్థాన్, చైనా సవాళ్లకు దీటైన బదులు:

పాకిస్థాన్ మోహరింపు: పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ (PAF) వద్ద ప్రస్తుతం F-16లతో పాటు చైనా నుంచి కొనుగోలు చేసిన J-10C / J-10CE వంటి 4.5 జనరేషన్ ఫైటర్ జెట్లు, JF-17 యుద్ధ విమానాలు కలిపి మొత్తం 420కి పైగా కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. చైనా టెక్నికల్ సాయంతో పాక్ తన వాయుసేనను బలపరుచుకుంటోంది.

చైనా ముప్పు: ఉత్తర సరిహద్దులో చైనా తన J-20 స్టీల్త్ ఫైటర్ల సంఖ్యను ఏకంగా 500 వరకు పెంచినట్లు అంచనా. అంతేకాకుండా కొత్త J-35 స్టీల్త్ ప్లాట్‌ఫారమ్‌లు, J-16, J-10C జెట్లతో పాటు అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ నెట్‌వర్క్‌ను చైనా సిద్ధం చేస్తోంది.

ఈ నేపథ్యంలో అత్యంత ఆధునిక 4.5 జనరేషన్ రఫేల్ జెట్లు భారీ సంఖ్యలో అందుబాటులోకి వస్తే.. లాజిస్టిక్స్, శిక్షణ, మెయింటెనెన్స్ చాలా సులభం అవుతాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

స్వదేశీ ఆయుధాలతో రఫేల్ అనుసంధానం:

కొత్తగా రానున్న రఫేల్ జెట్లలో కేవలం విదేశీ ఆయుధాలే కాకుండా.. భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన ‘అస్త్ర’ (Astra) ఎయిర్-టు-ఎయిర్ మిసైల్స్, ఇతర స్వదేశీ సెన్సార్లను జోడించనున్నారు. దీనివల్ల రఫేల్ మరింత శక్తివంతంగా మారుతుంది.

ఇతర దేశీయ ప్రాజెక్టులు కూడా..

కేవలం రఫేల్ పైనే కాకుండా.. భారత్ తన స్వదేశీ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. సూపర్ సుఖోయ్, తేజస్ ఎంకే-1ఏ (Tejas Mk-1A), తేజస్ ఎంకే-2, అత్యాధునిక ఫిఫ్త్‌ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ అయిన AMCA వంటి స్వదేశీ ప్రాజెక్టులను సమాంతరంగా అభివృద్ధి చేస్తోంది. మొత్తంగా 200+ రఫేల్ ఫైటర్ జెట్లు భారతదేశ ఎయిర్ వార్ వ్యూహంలో గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us