
ఐఐటీ ఢిల్లీ తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకుంది. గత రెండేళ్లలో 197, 150 స్థానాల్లో నిలిచిన ఐఐటీ ఢిల్లీ, ఈసారి ఏకంగా 70 స్థానాలు ఎగబాకి 123వ స్థానంలో నిలిచింది. అమెరికాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ఐఐటీ ఢిల్లీ ఈ ర్యాంకును పంచుకుంది. ఉద్యోగ కల్పన (50వ స్థానం), సైటేషన్లు (86వ ప్లేస్), సుస్థిరత (172వ స్థానం), అకడమిక్ రెప్యుటేషన్ (142వ ప్లేస్)లో మెరుగుదల ఈ ర్యాంకు పెరుగుదలకు కారణాలు.
గత ఏడాది QS ర్యాంకింగ్స్ 2025లో 118వ స్థానంలో నిలిచిన ఐఐటీ బాంబే ఈసారి 129వ స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ, ప్రపంచంలోని టాప్ 130లో నిలవడం చెప్పుకోదగ్గ విషయం. ఉద్యోగాల కల్పనలో 39వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ర్యాంకింగ్స్‌లో అమెరికా నుండి 192, యూకే నుండి 90, చైనా నుండి 72 సంస్థలు ఉన్నాయి. భారత్ నుండి 54 ఉన్నత విద్యాసంస్థలు చోటు దక్కించుకోవడంతో, భారత యూనివర్సిటీలు నాలుగో స్థానంలో నిలిచాయి.
ఈసారి క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితాలో ఎనిమిది భారతీయ విద్యాసంస్థలు కొత్తగా ప్రవేశించాయి. ఏ ఇతర దేశం నుండి కూడా ఇన్ని కొత్త సంస్థలు ఈ జాబితాలో చేరకపోవడం విశేషం. దేశంలోని 11 ప్రభుత్వ, ఆరు ప్రైవేట్ యూనివర్సిటీలు ఈ ఏడాది తమ స్థానాలను మెరుగుపరుచుకున్నాయి. ఐఐటీ మద్రాస్ 47 స్థానాలు ఎగబాకి తొలిసారిగా టాప్ 200లోకి ప్రవేశించింది. ప్రస్తుతం 180వ స్థానంలో నిలిచింది. షూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (503వ స్థానం), చండీగఢ్ యూనివర్సిటీ (575వ స్థానం), బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (668వ స్థానం) వంటి సంస్థలు కూడా చోటు దక్కించుకున్నాయి.
క్యూఎస్ సీఈఓ జెస్సికా టర్నర్ భారత్ విద్యా రంగం సాధించిన ప్రగతిని ప్రశంసించారు. “భారతదేశం ప్రపంచ ఉన్నత విద్యా పటాన్ని తిరిగి రాస్తోంది. ఈ ఎడిషన్‌లో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో మరే దేశంలోనూ ఇన్ని కొత్త యూనివర్సిటీలు చోటు దక్కించుకోలేదు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యా వ్యవస్థకు స్పష్టమైన సంకేతం. ఒక దశాబ్దంలో భారత్‌లోని యూనివర్సిటీలు క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో 11 నుండి 54కు పెరిగాయి. ఇది 390 శాతం పెరుగుదల” అని ఆమె వ్యాఖ్యానించారు.
The QS World University 2026 Rankings bring great news for our education sector. Our Government is committed to furthering research and innovation ecosystems for the benefit of India’s youth. https://t.co/wO11jvnr0J
— Narendra Modi (@narendramodi) June 19, 2025
భారత్‌కు చెందిన 54 విశ్వవిద్యాలయాలు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. “మన విద్యా రంగానికి ఇది గొప్ప శుభవార్త” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పరిశోధన, ఆవిష్కరణలను పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, జాతీయ విద్యా విధానం 2020 దేశ విద్యా రంగాన్ని మార్చిందని అభిప్రాయపడ్డారు. “2014లో కేవలం 11 విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్స్‌లో స్థానం పొందగా, ఇప్పుడు 54కు పెరిగాయి. జీ20 దేశాలలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యా వ్యవస్థ. యూఎస్, యూకే, చైనా తర్వాత నాలుగో స్థానంలో ఉండటం చాలా గర్వకారణం” అని ఆయన పేర్కొన్నారు.