భారత్ వలస రాజ్యం కాదు, ఒక ప్రజాస్వామ్య దేశం: ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ స్ట్రాంగ్ కౌంటర్

భారత్‌లో స్టార్‌లింక్ అనుమతులపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు నటుడు, ఎంపీ కమల్ హాసన్ కౌంటర్ ఇచ్చారు. భారత్ సార్వభౌమాధికారం కలిగిన దేశమని, జాతీయ భద్రత విషయంలో రాజీ పడకూడదని పేర్కొన్నారు. భారత్ ఏ ఇతర దేశాలకో వలస రాజ్యం కాదని, సార్వభౌమాధికారం కలిగిన బలమైన ప్రజాస్వామ్య దేశమని స్పష్టం చేశారు.

భారత్ వలస రాజ్యం కాదు, ఒక ప్రజాస్వామ్య దేశం: ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ స్ట్రాంగ్ కౌంటర్
Kamal Haasan On Elon Musk

Updated on: Oct 10, 2026 | 8:45 AM

భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. భారత్‌లోని కొందరు కుబేరులు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు.. వరుసగా ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్న ఎలాన్ మస్క్‌కు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎస్) పార్టీ అధినేత ఎంపీ కమల్ హాసన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.. భారతదేశంలో స్టార్‌లింక్ లైసెన్సింగ్ విధానాలు, నిబంధనలపై ఎలాన్ మస్క్ చేసిన విమర్శలపై కమల్ హాసన్ తీవ్రంగా స్పందిస్తూ.. భారత్ ఏ ఇతర దేశాలకో వలస రాజ్యం కాదని, సార్వభౌమాధికారం కలిగిన బలమైన ప్రజాస్వామ్య దేశమని స్పష్టం చేశారు. ఈ మేరకు మస్క్ ట్వీట్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

భారతదేశ నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రమ్ కేవలం వాణిజ్య ఆస్తులు మాత్రమే కాదని, అవి దేశ వ్యూహాత్మక మౌలిక సదుపాయాలని కమల్ హాసన్ పేర్కొన్నారు. దేశ జాతీయ భద్రతా రక్షణ నిబంధనలతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై అమెరికా విధిస్తున్న సుంకాలు (Tariffs), భద్రతా కారణాల దృష్ట్యా హువావె (Huawei) సంస్థపై విధించిన ఆంక్షలను ఈ సందర్భంగా కమల్ ప్రస్తావించారు. కేవలం తమ దేశీయ ప్రయోజనాలు, భద్రత కోసం పాశ్చాత్య దేశాలు ఆంక్షలు పెట్టుకోవచ్చని, కానీ భారత్ తన సొంత నిబంధనలు అమలు చేస్తే తప్పుపట్టడం ద్వంద్వ వైఖరి అవుతుందని ఎత్తిచూపారు. దేశంలో సరసమైన మొబైల్ డేటా ద్వారా కోట్లాది మంది ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటున్నారని, సాటిలైట్ ఇంటర్నెట్‌ను అనుమతించే తరుణంలోనే దేశీయ పరిశ్రమల రక్షణ, భద్రతా ప్రమాణాలను కూడా సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


ఇదిలాఉంటే.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని టార్గెట్ చేస్తూ ఎలాన్ మస్క్ మరో ట్వీట్ చేశారు. ‘డియర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అంబానీ.. భారత్‌లో అసలైన బాస్‌ మీరేనని గుర్తించలేకపోయినందుకు క్షమించండి’ అంటూ వ్యంగ్యంగా పోస్ట్‌ చేశారు. దేశంలో మీ గుత్తాధిపత్యాన్ని కొనసాగించాలనుకోవడం సహజమేనని.. అయితే.. స్టార్‌లింక్‌కు కూడా పోటీ పడే అవకాశం ఇవ్వాలని కోరారు.

ఖండించిన కేంద్రం..

ఇదిలాఉంటే.. స్టార్‌లింక్‌ సేవలకు అనుమతులు ఆలస్యం కావడం వెనుక వ్యాపార గుత్తాధిపత్య ప్రయోజనాలు ఉన్నాయన్న మస్క్‌ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలందించే సంస్థలన్నింటికీ ఒకే విధమైన, వివక్షలేని నియంత్రణ విధానం అమలవుతోందని స్పష్టం చేసింది.

స్పందించిన రాహుల్ గాంధీ

మస్క్ వ్యాఖ్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. మస్క్ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ.. భారత్‌కు స్వాగతం ఎలాన్‌.. ఇంకో వ్యక్తి గురించి తెలుసుకునే వరకు వేచి చూడండి.. అంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్ చేశారు.. దానికి మస్క్‌ కూడా స్పందిస్తూ.. థ్యాంకూ రాహుల్.. ఇది నిజంగా ఆందోళనకరమంటూ బదులిచ్చారు. ఈ క్రమంలోనే.. మస్క్ చేస్తున్న వరుస ట్వీట్లు దుమారం రేపుతున్నాయి..

స్టార్‌లింక్ అనుమతుల విషయంలో ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు, దేశీయ రాజకీయ ప్రముఖుల నుంచి వ్యతిరేక స్పందనలు వస్తున్న తరుణంలో కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us