Uttar Pradesh: యూపీలో 13 ఏళ్ల బాలికపై దారుణం.. పోలీసుతో పాటు నలుగురు అత్యాచారం..

|

May 05, 2022 | 12:24 AM

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో కీచకపర్వం వెలుగుచూసింది. ఓ బాలికపై పోలీసుతో పాటు నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు.

Uttar Pradesh: యూపీలో 13 ఏళ్ల బాలికపై దారుణం.. పోలీసుతో పాటు నలుగురు అత్యాచారం..
Follow us on

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో కీచకపర్వం వెలుగుచూసింది. ఓ బాలికపై పోలీసుతో పాటు నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. యూపీలోని లలిత్‌పూర్‌ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలికకు నలుగురు యువకులు మాయమాటలు చెప్పి భోపాల్‌కు తీసుకెళ్లారు. అక్కడ నిర్బంధించి నాలుగు రోజుల పాటు అత్యాచారం చేశారు. ఆమె ఆ రాక్షసుల చెర నుంచి ఎలాగో తప్పించుకుని బయటపడింది. అతి కష్టంమీద ఇంటికి చేరుకుంది. తనపై దారుణానికి ఒడిగట్టిన నలుగురు యువకులపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. అయితే ఆ నలుగుర్ని మించిన మరో రాక్షసుడు అక్కడ ఉన్నాడు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి కూడా ఆమెపై లైంగిక దాడి చేశాడు. తర్వాత చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి అప్పగించాడు.

చైల్డ్‌ లైన్‌ అధికారులు బాధితురాలిని విచారించినప్పుడు అసలు ఏం జరిగిందనే వారికి చెప్పింది. దాంతో ఈ దారుణం గురించి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ లలిత్‌పూర్‌ ఎస్పీకి చెప్పింది. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌తో తిలక్‌ధారి సరోజ్‌తో పాటు ఆరుగురు వ్యక్తులపై పాలీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు ఎస్పీ నిఖిల్‌ పాఠక్‌. ఎస్‌హెచ్‌వో సరోజ్‌ను వెంటనే అరెస్ట్‌ చేశారు. ఆ ఠాణాలోని పోలీసులు అందరినీ విధుల నుంచి తొలగించారు. మరోవైపు ఈ అంశంపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని యూపీ డీజీపీ, సీఎస్ కు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చింది. బాధితురాలి కుటుంబాన్ని సమాజ్‌వాది చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ పరామర్శించారు. యోగి సర్కారులో పోలీసులు నియంతలుగా మారి, పిల్లలపై కూడా అకృత్యాలకు పాల్పడుతున్నారని అఖిలేష్‌ మండిపడ్డారు. బాలికపై దారుణం యూపీని కుదిపేస్తోంది.