హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ ని ఫేస్ బుక్ నిషేధించింది. పాలక బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలను, వ్యాఖ్యలను ఫేస్ బుక్ పట్టించుకోవడంలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఫేస్ బుక్ ఈ చర్య తీసుకుంది. హింసను, ద్వేషాన్ని రెచ్ఛగొట్టేట్టు ప్రసంగాలు చేసే వ్యక్తులను నిషేధించాలన్న మా పాలసీని ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు ఈ సోషల్ మీడియా జెయింట్ ప్రతినిధి ఒకరు ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. ఆయన అకౌంట్ ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
తనకు ఫేస్ బుక్ లో ఎలాంటి ఖాతా లేదని, తన పేరిట కొందరు ఫేస్ బుక్ పేజెస్ ని వినియోగిస్తున్నట్టు తనకు తెలిసిందని గతనెలలో రాజాసింగ్ ట్విటర్ వీడియో ద్వారా తెలిపారు. అధికారికంగా నాకు ఎలాంటి పేజ్ అంటూ లేదు.. ఎవరైనా పోస్ట్ పెడితే నా బాధ్యత కాదు అని ఆయన అన్నారు. మతపరమైన, ద్వేషాన్ని ప్రేరేపించే ప్రసంగాలు తాను చేయలేదని, తన అధికారిక ఖాతాను 2018 లో హ్యాక్ చేసి బ్లాక్ చేశారని ఆయన తెలిపారు. నాకు అఫీషియల్ గా యూట్యూబ్, ట్విటర్ అకౌంట్ ఉన్నాయి అని ఆయన స్పష్టం చేశారు.
కాగా ఈ ఎమ్మెల్యే చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల కారణంగా ఇండియాలో బిజినెస్ అవకాశాలు దెబ్బ తింటాయంటూ ఫేస్ బుక్ ఇండియా ఎగ్జిక్యూటివ్ అంఖి దాస్ ఓ ఇంటర్నల్ కమ్యూనికేషన్ లో చెప్పారని, పేరు తెలియని ఇన్ సైడర్లు ఇంకా ఉన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఫేస్ బుక్ పై తన తొలి రిపోర్టును ప్రచురించింది.