
బాబోయ్.. విమాన ప్రయాణం.. అనాల్సి వస్తోంది. ఎందుకంటే వరుసగా వస్తున్న వార్తలు ప్రజలు, ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాద గాయాలు ఇంకా మానలేదు. అంతలోనే జూన్ 15న జర్మనీ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ వినాశ్రయానికి వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని రొమానియా నుంచి ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) ఎయిర్ పోర్టుకు తరలించారు. తాజాగా మరో విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య 250 మంది ప్రయాణికుల్ని ఆందోళనకు గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
లక్నోలో విమానం తృటిలో ప్రమాదం నుండి తప్పించుకుంది. ల్యాండింగ్ సమయంలో చక్రం నుండి నిప్పురవ్వలు విరజిమ్మాయి. సౌదీ అరేబియా నుండి హజ్ యాత్రికులు సహా 250మంది ప్రయాణికులతో వెళుతున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని లక్నోలో ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఎడమ టైర్ నుండి పొగలు వెలువడినట్లు అధికారులు తెలిపారు. హైడ్రాలిక్ వ్యవస్థలో లోపం కారణంగానే టైర్‌లో లోపం ఏర్పడివుండవచ్చని అధికారులు వివరించారు.
వీడియో ఇక్కడ చూడండి..
Hajj Flight Faces Wheel Glitch At Lucknow Airport; Sparks, Smoke Erupt During Landing.#HajjFlight #LucknowAirport #WheelGlitch
(Video: X) pic.twitter.com/QT0QZ9Sh9c
— Deccan Chronicle (@DeccanChronicle) June 16, 2025
ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఎయిర్ బస్ ఎ330-343 విమానం జెడ్డాలో రాత్రి 10.45 గంటలకు బయలుదేరి ఉదయం 6.50 గంటలకు లక్నోలోని అమౌసీ విమానాశ్రయంలో దిగింది. రన్‌వేపై దిగిన తర్వాత టాక్సీవే పైకి వస్తుండగా ఎడమ టైర్ నుండి నిప్పురవ్వలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందించారు. సిబ్బంది 20నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ టైర్ పనిచేయకపోవడంతో మంటలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..