
ఈవీఎంలపై గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా విస్తృత చర్చ నడుస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ఈవీఎంలతో పాటు నకిలీ ఓట్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీజేపీకి ఎన్నికల సంఘం అనుకూలంగా వ్యవహరిస్తోందని.. అందుకే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయనేది విపక్షాల ప్రధాని ఆరోపణ. అయితే ఎన్నికల సంఘం మాత్రం అటువంటిది ఏమి లేదని కొట్టిపారేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్ధి కలర్ ఫోటోలను ముద్రించనున్నారు. ఈ మార్పులు త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి రానున్నాయి.
కాగా ఇప్పటివరకు కేవలం నలుపు-తెలుపు లేదా చిన్న సైజు ఫొటోలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అభ్యర్థుల ఫొటోలను రంగుల్లో ముద్రించనున్నారు. అంతేకాకుండా అభ్యర్థి ముఖం మరింత స్పష్టంగా కనిపించేలా, ఫొటో కోసం కేటాయించిన స్థలంలో మూడింట ఒక వంతు ముఖానికి కేటాయిస్తారు. దీంతో ఓటర్లు అభ్యర్థిని సులభంగా గుర్తించగలుగుతారు. అభ్యర్థుల పేర్లు, అలాగే NOTA ఆప్షన్ ఒకే రకం, ఒకే సైజు ఫాంట్‌లో ముద్రిస్తారు. ఈ ఫాంట్ పరిమాణం కూడా పెద్దగా ఉంటుంది. దీనివల్ల వృద్ధులు లేదా దృష్టి లోపం ఉన్నవారు కూడా సులభంగా చదువుకోగలుగుతారు.
ఈ మార్పుల వల్ల ఓటర్లకు పోలింగ్ బూత్‌లో గందరగోళం లేకుండా, తాము ఎంచుకున్న అభ్యర్థికి సులభంగా ఓటు వేయడం సాధ్యమవుతుంది. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, ఓటర్లకు అనువుగా మార్చాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. గత ఆరు నెలల్లో ఓటర్లకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తీసుకున్న 28 కీలక చర్యల్లో ఇది కూడా ఒక భాగమని కమిషన్ స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..